పుట:2015.393685.Umar-Kayyam.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

20

ఉమర్ ఖయ్యామ్

75

కర్మిష్ఠలతో ప్రసంగము

కోవిదవర్య ! శాంతి వినఁగోరెద నాపలు కీవు నేనునుం
బోవుచునున్న మార్గ మొకపోలిక దై నను వామమార్గ మం
ది వొకదృష్టి నిల్పితివి యెప్పటికైనను దిద్దుకొమ్ము ; నా
పై విరసోక్తు లాడకు ; నెపంబులు వీడుమి యీశ్వరార్థమై.

76

ద్రాక్షరసంబులో రుచి యథార్థముగా నది త్రావుచున్న యా
దక్షుఁ డెఱుంగుఁ గాని ధనదాసులు, కుత్సితమానసుల్, వృథా
భిక్షుల కెట్లు తోఁచు ? నవివేకత వార లెఱుంగలేరు ; వి
శ్వక్షితి మర్త్యుఁడే మధురసంపు రసంబుతెఱం గెఱింగెడున్.

77

ప్రేమార్ద్రప్రతిపాదితంబయిన మాహృత్పాత్రలో శీధు వెం
తే మర్యాద వహించు ; మత్తనఁగ రానేరాదు ; కర్మిష్ఠియున్
భూమాగ్నిన్ సుర యింతపోసిన నభంబున్ ముట్టంగా మండు; రెం
డే మార్గంబులు వహ్ని, నీటఁబడ మాయించున్ బృథుజ్వాలలన్.

78

మాసభయందుఁ ద్రాగుడును, మంజులగానము, పానపాత్రలే
భాసిలుచుండు ; మేము మధుపానమదోద్ధతి నుందు మెప్డు ; నీ
వ్యాసము లిందుఁజెప్పకు మతాంతరవర్తి ! దురాత్మ ! యింక మా
యాసవమున్, మృగాక్షియధరాసవమున్ మముఁదేర్చు నెంతయున్.