పుట:2015.393685.Umar-Kayyam.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉమర్ ఖయ్యామ్

15

55

ప్రాఁతసత్రంబు నిజము ప్రపంచ మనఁగ
సంధ్యలు, నుషస్సు లనెడు నశ్వములనెలవు
శీధుసభ యిది పెక్కు "జంషీదు" లకును
ప్రణుతభవనంబు పెక్కు "బైరాము" లకును.

56

నీవు జనింపక పూర్వం
బీ వసుధన్ స్త్రీలుఁ, బురుషు లెందఱొ కల రా
జీవమె నీలో నున్నది
యీవును నశియింతు వెపుడొ యిఁక రా వేఁగన్.

57

ఏ సౌధాళిని విశ్రమించి బెహరా మెంతే సురన్ ద్రావెనో
యా సౌధానఁ గురంగసంతతియు, సింహవ్రాతమున్ నిండి యెం
తే సుప్తిం గనుఁ నాతఁ డేమృగములన్ హింసించెనో నేఁ డవే
గాసిన్ ద్రొక్కగఁ గోరి కిప్డు బలియై కైసాచెఁ గాలాహతిన్.

58

నీరదనీలవేణుల ననేకల బూడిదపాలు చేసి శృం
గార రసప్రపూర్ణలగు కాంతల వాతెఱ నేలఁగల్పి యెం
తే రగిలించె దుఃఖ మెదఁ దీఱనిమచ్చ ఘటించె దైవ మ
య్యో రమణీయ సౌధముల నూరును బేరును లేక కూల్చుచున్.