పుట:2015.393685.Umar-Kayyam.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉమర్ ఖయ్యామ్

13

47

కాలమ! నీవు నీ కపట కారణమున్ బ్రకటించి యీ జగ
జ్జాలము మ్రింగుచుంటిని విషాదముఁగూర్చుచుఁ బ్రాయికంబుగా
ఖేలనమయ్యె నీ కవనిక్రింద సమాధుల నిద్రవోవు ర
త్నాలను బోలు కోవిదుల తాళముబట్టి తిరస్కరింపఁగన్.

48

పాఱెడు నీటియొడ్డు పొలుపారెడు పచ్చని పైరు చూచి సొం
పారెడు నే మనోహరి ప్రపంచ శరీరమువాసి వాసిమై
మాఱెనొయంచు నెంచుము ప్రమాదమతిన్ దెగిత్రుంపఁబోకుమా
చారు సువర్ణమండిత ప్రశస్త కళా కలితాంగ మయ్యెడన్.

49

కంటకరాశి నెల్లెడ మృగంబులు ద్రొక్కుచుఁ పోవుచున్న; వా
కంటక మేమృగేక్షణ వికాసపు ముంగురులందు భాగమో
పంటవలంతి సౌధములపై నిటుకల్ నృపమస్తకంబులున్
దొంటి విశీర్ణవృత్తి మృతి దొట్రిల నాగతి మార్పఁబోలదే.

50

ఈ మధుపాత్ర నావలె మృగేక్షణనోర్తు వరించి పూర్వ మా
ప్రేమను నామె ముంగురుల ఱివ్వునఁ జిక్కి విశీర్ణమై యొగిన్
గామిని కంఠహారమయి క్రాలినఁ దాని కరాలమృత్తుచే
నీ మహితాకృతిన్ బడసె నిం దనియున్నది దీని మోమునన్.