పుట:2015.393685.Umar-Kayyam.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉమర్ ఖయ్యామ్

7

24

ఊహ లను కాచకు ప్పెల నొప్పి కాల
చక్ర నిహతిఁ బరిభ్రాంతిసంచరించు
నవనియే కాచకు ప్పె యీ యర్కుఁ డందు
వెలుఁగు దీపంబు తిరుగు బొమ్మలము మేము.

25

ఆది యనాదిలోఁగల రహస్యము నీకును నాకుఁ దోఁచ దీ
భేద సమస్యలో ముడినివిప్పఁగ నీవును నేను జాల మీ
వాదములన్ని వట్టి తెరబైటవి యీ తెర లేచిపోవుచో
నేదియు లేదు కేవలము నీవును నేనును నుండ మచ్చటన్.

26

ప్రాఁతది క్రొత్తమార్పులను బన్నెడి యీ విధికొంగునుండి యే
రీతినొ తప్పుకొ మ్మొక సుహృద్వచనమ్ములచేత నీ మహా
ఘాత దురాగతార్ణవము కాలహతిన్ బడిపోకమున్నె నీ
చేతము మార్చు వాదములుచేయకు దీర్ఘములీ విచారముల్.

27

వైరుల్ నన్నుఁ బదార్థవాదియని సంభాషింతురే వార లే
తీరున్ న న్నటులాడ నేర్చిరొకొ యర్థిన్ జెప్పరే కాని సొం
పారన్ ధాత్రికులాయమందు సృజియింపన్ వచ్చితిన్ నేను నా
దేరూపం బని చర్చ చేయవలదా యిం దేమి తప్పున్నదా!