పుట:2015.393685.Umar-Kayyam.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4

ఉమర్ ఖయ్యామ్

12

జీవ రహస్యమంతయు నశేష మెఱింగితి; చావులోన నే
దో విభవంబు నున్నటులు తోఁచె స్వతంత్ర సజీవుఁడైన నీ
వీవిషయం బెఱుంగక ముగించిన మృత్యువు ఱేపు వచ్చినన్
నీ వెటనుందువో బ్రతుకు నిష్ఫలమై చను నస్వతంత్రతన్.

13

ఆ విధి నన్నుఁ దెచ్చి జగమందున లాభము పొందలేదు వా
పోవఁగ నన్నుఁజంపికొని పోయి గడించిన గొప్ప లేదు దా
నీ విధి చావుపుట్టుకల నేటికిఁబెట్టెనో తెచ్చి తీసికోఁ
బోవుటలో రహస్యము ప్రబోధము సేయరు నేఁటి కెవ్వరున్.

14

పాఠాంతరము :_
పాయక నన్ను ధాత్రి గొనివచ్చిన స్రష్టకు లాభమింత రా
దాయెను నన్నుఁ జంపి విగతాసువు జేసినఁ గీర్తి హెచ్చి పో
దాయెను నాతఁ డీశ్రమలయందు గడించెడిదేమి జీవు లీ
చాయను బుట్టుచున్ దిరిగి చచ్చుటలో ఫలమున్నఁ జెప్పుడీ.

15

హతవిధి! తొల్లి యీతనువునం దిడి నాకొక యస్వతంత్రతా
స్థితి కడుఁగూర్చి; తీ బ్రతుకు చిత్రముతప్ప మఱేది నాకు స
ద్గతి గనరాక యిందె నిజ కాలముఁబుచ్చితి నెట్లు పుట్టుటన్
బ్రతుకుటఁ జచ్చుటన్ దెలియ వచ్చుటలేదు రహస్యమేమిటో.