పుట:2015.393685.Umar-Kayyam.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉమర్ ఖయ్యామ్.

1

ఎక్కడనుండి వచ్చితిమొ యెక్కడి కేఁగుటకౌనొ యెవ్వరీ
నిక్కమెఱింగి చెప్పుటకు నేర్చినవారలుగారు ధాత్రియం
దక్కట దీనికిన్ మొదలు నంతము నిట్టిదటంచుఁ దోఁచ దీ
ఫక్కిని జీవయాత్రకయి వచ్చుచుఁ బోవుచు నుంటి మెంతయున్.

2

ఎవ్వరివల్లఁ గా దల యతీంద్రియమన్ దెర దాఁటిపోవ నిం
దెవ్వరు నీరహస్య మిదమిత్థమటంచును జెప్ప లేరు ముం
దివ్వసుధాంతరంగ నిజ మృద్గృహ గమ్యతలంబు; కాని యీ
నెవ్వగ పెద్దగాధవలె నివ్వెఱఁగొల్పును జెప్పవచ్చినన్.

3

ఇదియే సత్యమటన్న వాదతరు వెంతే వృద్ధికాలేదు ; ఈ
పదమం దెవ్వరు నెగ్గఁజాల రొకపల్వన్ శాంతి హస్తంబు మో
పి దినా లాఱడిఁబుత్త్రు నిన్నటివలెన్ విభ్రాంతి, ఱేపైన నేఁ
టి దినం బట్టులెపోవు నీస్థితులు నిట్లేయుండు నెన్నాళ్లకున్.