పుట:2015.393685.Umar-Kayyam.pdf/212

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉమర్ ఖయ్యామ్

167

655

గుడిలోఁ జీకటియున్, మసీదుగల వెల్గున్, నారకావాసమం
దిడుమల్, స్వర్గసుఖంబు, గూర్చి నుతు లింకెన్నాళ్లుసాగింతువో
బడుగా ! నొస్టను మున్నె వ్రాసి విధి సంప్రాప్తార్థముల్ ; వాని వెం
బడి నీవేఁగుట తప్ప దా లిపి యదే వల్లింపు మింకేటికిన్.

656

భవదీయం బగుప్రాప్త మెంత గలదో భద్రంబుగా ముట్ట కే
లవమున్ దగ్ధదు, హెచ్చ ; దున్న తృణమేలక్ష్యంబులో నుంచి తృ
ప్తి వహింపన్ దగు ; లేనిదానికయి చింతింపంగఁబో ; కెప్పు డీ
యవనిన్ గోవిదు లన్నవారెకడు మూఢాత్ముల్‌సుమీ యీయెడన్.

657

ఏ పనియైనఁగాని మన యిచ్చకుఁ బోలినరీతిఁ గాదు కా
దేపనికైన యత్నమును నేడ్పును గూడదు ; మానవుండు ము
న్నీపృథివిన్ జనించుటకు నెంతయొ కాలము పట్టెఁగాని నేఁ
డీపృథివిన్ వడిన్ విడిచి యేఁగుచునుండె క్షణంబులోపలన్.

658

కాలహయంబు వీఁపున నిగారపుజీను రచించినప్డె యీ
లీల నభంబు భంబు లవలీల సృజించినాఁడె తీర్చి మా
ఫాలముపై లిఖించె విధిపంక్తులు మూఁటిని నేఁటిదాఁక నా
వ్రాలనె యానవాలుగను గ్రాలిన మాపయిఁ దప్పు లుండునే.