పుట:2015.393685.Umar-Kayyam.pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

148

ఉమర్ ఖయ్యామ్

582

ఇలు విడనాడి, ప్రాణచయ మేఁగిన, వస్తువు లన్ని పూర్వపు
న్నిలయములందుఁ జేరుకొను ; నెమ్మి శరీరకళాకలాప సం
చలనభరంబు లీ ప్రకృతి శర్వరి కాలహతిన్ దహించి ము
క్కలయి గణింపరాకయ వికావికలై నశియించుఁ గ్రమ్మఱన్.

583

లలితమనోజ్ఞయౌవనవిలాససముత్సవకాల మేఁగె ; నా
కలితకలాపసమ్మదవికాసవినూతనయౌవనంబు నాఁ
జెలఁగువిహంగ మచ్చెరువుఁ జెందఁగ నెప్పుడు వచ్చె ? వచ్చియున్
బొలుపుగఁ జెప్ప కే యెగిరి పోయిన దెప్పుడు ? చిత్ర మయ్యెడున్.

584

అరిగిరి ప్రేమపాత్రపరమాప్తు లొకొక్కరు మృత్యుకామినీ
చరణములందుఁ ద్రొక్కఁబడి చచ్చిరి మైకము గ్రమ్మ ; వార లం
దఱు మనతోడనే తినుచుఁ ద్రాగుచు నుండినవారె కాని, ముం
దఱ మఱి రెండుముద్ద లిడుదాఁకను నిల్వకపోయి రంతియే !

585

బందుగులతోడ నానంద మందిరముల
యందు వయసెల్ల భోగభాగ్యములఁ గడపి
తుదకు విడనాడి పోక తప్పదు ; జగంబు
స్వప్న మిది చూచుచుంటిని బ్రతికియుండి.