పుట:2015.393685.Umar-Kayyam.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

146

ఉమర్ ఖయ్యామ్

574

అరిగెడు కాలచక్రమిదియాగ ; దొకేగతి నెన్నియేఁడులో
తిరిగెడు ; నీ ప్రమాదసముదీర్ణవినాశనమైన కాలపున్
రిరుగుడుచేత మేను చనుదెంచితి ; మిందు దినంబులట్టు లే
మఱి క్షణ ముండిపోయెదము ; మానము వచ్చిన త్రోవచొప్పునన్.

575

అవనిని జూచి చూడఁబడు నట్టిపదార్థము లెల్ల వ్యర్థముల్
వివిధము లైనవాక్యములు విన్నవి, చెప్పిన వెల్ల వ్యర్థముల్
భువి యొకమూలనుండి, యొక మూలకుఁ బాఱుట లెల్ల వ్యర్థముల్
భవనమునందె మెట్టుచును, బాడుచుఁ గుందుట లెల్ల వ్యర్థముల్.

576

అక్కట ! యీశరీరమున కాకృతి యన్నదె లేదు ; భూమిపై
నొక్కెడఁ జప్పరం బిడఁగ నుండిన దీనికిఁ దావె లేదు ; ఈ
చక్కి వివాదపుంబ్రతుకు చావుల కూపిరి యాడుచుండుటే
తక్క మఱేమి యున్న దిది దాఁటిన నేమియు లేదు చూఁడగన్.

577

పుడమిని సౌఖ్యమున్ వెదకఁ బోకుము ; జీవిత మొక్కలిప్తలోఁ
జెడుఁ ; బ్రతిమృత్కణంబు "జమషీదు" శరీరమొ "కైకుదాదు" పే
రొడలొ ; మనుష్యజీవితము నుర్వి నిజంబుగఁ బృచ్ఛ చేసినన్
గడ కొకస్వప్న భావ మిదిగారుడయంత్రము ; మాయ గాదొకో.