పుట:2015.393685.Umar-Kayyam.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇట్టివే పెక్కులు గలవు. గ్రంథవిస్తరమని వ్రాయలేదు. ప్రతి పద్యమును భావపూరితమైన ప్రస్తావనమున కనుకూలించు నట్లుండును. ఇట్లే రాజులనుగూడ నిందించినాఁడు.

ఉ. గాడిదవంటి యీనృపులకైవస మేమిఫలంబుగూర్చు నీ
    తోడను నేల పాండితిని దోడ్కొనిపోయెదు వీరు విద్యకున్
    బోడిమికిన్ వెలన్ ఒసఁగఁ బోవరు వత్సరమేడిపించి యే
    నాఁడును చేరెఁడంబువుల నర్మిలఁ బోయరు దాహ మారఁగన్.

అసలీతఁడు విషయాసక్తుఁడే కాఁడని, ఈతని వేదాంతములోని మధువు ధ్యానామృతమని, కాంత ముక్తికాంతయని, విషయోపభోగములు సమాధినిష్ఠావిధానము లని తూ చ లు పొల్లు పోకుండ అర్ధములు చెప్పువారును గలరు. వారీతనిగ్రంథము నుండియే యనే కోదాహరణములు చూపించెదరు. అవి :

శా. రాగద్వేషము లాశ్రయించి విషయభ్రాంతిన్ ప్రవర్తింప ను
     ద్యోగింపన్ దగునాజగాన విధి సంయోగంబుచే నెందఱో
     భోగాపేక్షను వచ్చిపోయి రిటురే ముందిఁక రానున్న వా
     రేఁగన్ జూతురే కాని యొక్కఁడిలపై నిష్టార్థముల్ పొందెనే.

ఉ. నీవు ధరిత్రి కామ విషయేచ్ఛలకై జనియించి తంచు నీ
    భావమునన్ దలంపకుము వ్యర్థుఁడవై నశియించి పోదు వే
    తావుననుండి వచ్చితివొ తథ్యము నీవన నేమివస్తువో
    నీవిపు డేమొనర్చుటకునెంచితివో పరికింపు మెంతయున్.

మ. విషయాసక్తికి లొంగిపోవక మహావేగంబుతోఁ బోవునా
      విషరాశింబలె తీవ్రవహ్ని విలసత్ విస్ఫూర్తిమైఁదాల్చి పౌ
      రుషలీలన్ మనఁజెల్లు గాని రజమై రోదోంతరాళంబునన్
      దృషవాతాహతిఁ బోవునట్టి బ్రతు కిందేలా విచారింపగన్.