పుట:2015.393685.Umar-Kayyam.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉమర్ ఖయ్యామ్

115

450

ఎంతకాలంబు బాధల యెసకమెసఁగఁ
దుచ్ఛు లిడు నగచాటుల త్రోవఁ బోదు ?
కటికి యుపవాసముల నెలల్ గడచిపోయె
పండు గిదె వచ్చె సుర ద్రావవచ్చు రమ్ము.

451

ఏనొకనాఁడై నను సుర
మాని యెఱుంగ ; నిది వ్రతతమస్సైన, సురా
పానము సేయుచు నీ నిసి
నానందించెదను జషకమం దిడి కరమున్.

452

పులిసిన ప్రాఁతశీధువును బుణ్యదినంబులఁ ద్రావువాఁడ వి
హ్వలమతిఁ గాక, ద్రాక్షరస మన్నది నిండు పవిత్రమైన దా
కలశమునందుఁ బోయుటను గాదె వికారము చేదు వచ్చె నీ
చెలువము దేవుఁ డేటి కిడెఁ జెప్పుము చెప్పినఁ ద్రావ మానెదన్.

453

పండుగదినంబు మద్యంబు రెండు మూఁడు
కలశములు ద్రావుద మనుంగుఁ జెలులఁ గూడి
తాళకాహళ భేరీ మృదంగ చారు
నాదములు మ్రోయ సంతతామోద మెసఁగ.