పుట:2015.393685.Umar-Kayyam.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉమర్ ఖయ్యామ్

111

434

ఓసుర ! నీవు భాసుర సముజ్జ్వల సుందర కాచపాత్రలో
భాసిలుచుండి కోవిదుల పాదయుగంబుల శృంఖలంబవై
గాసిలఁజేయు దెంతయును గైకొను వారి నిజస్వరూపముల్
పూసను గ్రుచ్చినట్లు వెలిపుచ్చక వీడవు కోటి చెప్పినన్.

435

ఓ పరమేశ్వరా ! బ్రతికియుంట కుపాధినొసంగి, వైభవ
ప్రాపితఫక్కి నిచ్చి, పరవంచనపా నోనరింపఁబోక సం
తాపము దీర్చు మద్యమున ధన్యునిఁజేయుము మైకమిచ్చి ; యీ
రూపమునన్ బ్రమత్తతను రోఁత జనింపఁగనీయ కేయెడన్.

436

ఓ నవమద్యమా ! సముచితోన్నతకీర్తివి నీవు ; నిన్ను నే
నీ నిఖిలావనీప్రజలు నెంచఁగఁ ద్రావెద ; నన్నుఁజూచి యో
హో ! నవమద్యపాయి యిదిగో చనుదెంచుచు నున్న వాఁడటం
చీ నరు లాడుకొంచుఁ బ్రకటింపఁగ దిక్కులు గీర్తినిండఁగన్.

437

యతి కాకుండ సురాపణంబునకు డాయంబోకు ; మద్యంబు, సం
తత గానంబు, వధూటులన్ వలచి మూర్ధంబందు మద్యంపు భాం
డతతిన్ దాలిచి, చేతఁ బాత్రగొని వేడ్కన్ మద్యమున్‌ద్రావుచున్
గుతుకంబొప్పఁ జరింపు ; వ్యర్థపదమున్ బోనాడు మెల్లప్పుడున్.