పుట:2015.393685.Umar-Kayyam.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

110

ఉమర్ ఖయ్యామ్

430

తరుణి ! వారుణీరస మిమ్ము తప్తహృదయ
మార్పుదును దెల్వి ననుబాయ నంతవఱకుఁ
ద్రావుచునెయుందు ; నాదు హస్తంబుఁ జూడు !
పానపాత్రను జూడు ! వేఱౌనె యెపుడు.

431

ఓసకియా ! మనోహర కుహూకల నిస్వనపూరపూరితం
బై నను సుప్రభాతమిది ; యాసవమమ్మెడు వీథియందు మ
ధ్వాసవ మున్నదిప్పుడు వ్రతాదుల యూసులు కట్టిపెట్టు మీ
వీ సమయంబునన్ మధువునేగొని వీడుము స్వర్గవాంఛలన్.

432

ఆసవపానమత్తమతినై విహరించెడు నన్ను నీశ్వరో
పాసన, శౌచశీలములఁ బాయనిదే దరిఁజేరఁబోకు ; మా
వాసము స్వైరచారుల నివాసము ; నీవు గ్రహింపలేవు దు
ర్వ్యాసములన్ బిభీషిక లటంచును నెంచకు రాకు మాకడన్.

433

పుట్టుచు నేమి తెచ్చితివి ? పోవుచు గైకొనిపోయెదేమి ? యీ
మట్టునఁ జెప్పు మద్యమును మానుము చావు నిజంబటంచు నన్
దిట్టెదు గాని యీ సురను దేరగఁ ద్రావినఁ ద్రావకుండినన్
గిట్టుట నిక్క ; మింకఁ బరికింపుము తెల్వియె యున్న నెచ్చెలీ !