పుట:2015.393685.Umar-Kayyam.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

104

ఉమర్ ఖయ్యామ్

406

"నేను సురఁ ద్రావ ; సుర గోప్తనీరుదిరము
గాన రుధిరపానము సేయ మానినాఁడ"
నన్న మతగురు వడిగె "సత్యంబె" యనుచు
"కాదు విరసోక్తి సుర మానఁగలనె?" యంటి.

407

అచ్చపువారుణీ రసమునం దభిలాషయు, వేణుగానమం
దిచ్చయుఁ బోదు నాశ్రవణ మేయెడ రాగరసంబునే సదా
మెచ్చుచు నుండు ; నాతనువు మృత్తికచేఁ గలశంబుఁ జేసిరే
నచ్చపు రూపుదాల్చి కుసుమాసవ మందున నిండి యుండెడిన్.

408

అవనిన్ సర్వముమిథ్య ; నేనొ మటుమాయన్ గాలమున్ బుత్తు ; నా
సవమున్, బ్రేమయు, రాగబోగము లుపాస్యంబయ్యెడున్ నాకు ; న
న్నవి వర్జింపుమఁటందు వీశ్వరుఁడు తానై వీని మాన్పింపఁ డ
ట్లివి మాన్పించిన నేను మానఁ బ్రజ లెంతే వచ్చి నిందించినన్.

409

ఎమ్మెయి దుఃఖభాజితుల కేడ్వఁగ నోపను ; స్వచ్ఛమైన మ
ద్యమ్మును, లోహితంబయిన ద్రాక్షారసంబును ద్రావ నెంతు మ
ద్యమ్మన లోకమన్ పురుషునందలి శోణిత ; మీజగమ్ము ని
క్కమ్ముగ మమ్ముఁ మ్రింగురిపు గావునఁ ద్రావెద దీని రక్తమున్.