పుట:2015.393685.Umar-Kayyam.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

80

ఉమర్ ఖయ్యామ్

314

ప్రళయదినమున నీ నీలవదన మెఱిఁగి
వ్రేళ్ళఁ గఱచెద నపవర్గ విభవ మెల్ల
నైహికసుఖాల కమ్మతినని "యుసూపు"
నపుడు పది దినారములకు నమ్మినట్లు

315

మధువు దొరకినఁ బ్రతి సభామండపమునఁ
గూరుచుండి త్రావుము హాయి గూర్చునట్టు
లాపరాత్ముఁడు నీమాస మరసిగాని,
నాదుగడ్డంబుఁ గనిగాని మోద మిడఁడు.

316

నీ రహస్యతత్త్వ మెఱుంగనేర రెవరు ;
పాప పుణ్యములకుఁ దృప్తిపడవు నీవు ;
నేను పాపనె గాని, విజ్ఞాని నగుట
నీదు దయచేతనె తరింపఁగాఁ దలంతు.

317

చలువులు విప్ప వచ్చినను దథ్యము నీవయి వచ్చి విప్పఁగా
వలయును ; దారి చూపునెడఁ బాంథుఁడవై చని నీవె చూపఁగా
వలయును ; గాన నే నెవరిపంచలఁ జేరను ; వారలెల్ల రీ
యిల నశియించి పోయెదరు నీవె స్థిరంబు సతంబు నీశ్వరా.