పుట:2015.393685.Umar-Kayyam.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

58

ఉమర్ ఖయ్యామ్

228

లెమ్మిఁకఁ దెల్లవాఱినది ; లీల నిశాంగనకొంగు ముక్కలై
యిమ్మెయి నేల రాలినది ; యేటికి దుఃఖితఁబోలె నుందు ? వో
కొమ్మ ! సురాసవంబు గయికొమ్ము ! ప్రభాతము లిట్లెయుండు నీ
నెమ్మొగమందువాలుచును ; నీ మొగ ముండదు పోవు బూడిదై.

229

ప్రాణము పూతమైనది ; పరాత్మనివాసము వీడి మృణ్మయం
బైన త్వదీయదేహ గృహమందున విందుల నారగింపఁగాఁ
బూనిక వచ్చె ; మద్యమును బోయుము లెస్సగఁ దృప్తి దీఱ నీ
మేనున కొక్కవందనము మేలని చెప్పియుఁ బోకపూర్వమే.

230

పువ్వులతోడఁ దూఁగు పువుబోఁడులతో జతగూడి, మద్యమున్
నవ్వుచుఁ ద్రావు ; మల్ల మరణంబను వాయువు నీతనూలతన్
జవ్వున రాల్చివేయును ; వసంతమునన్ వికసించు పువ్వునన్
నెవ్వగఁ గాల్చు గ్రీష్మమది ; నేరక పోవిడరాదు కాలమున్.

231

రాసక్రీడలఁ గూడి యాడుదము సంరంభంబుతో లెమ్ము ; రా
కాసిన్ గాసిని నెత్తిఁ దన్నుద ; ముషఃకాలం బదే వాయువుల్
శ్వాసన్ బీల్చుద ; మీ ప్రభాతములు కుప్పల్ కుప్పలైవచ్చు ; ని
శ్వాసంబుల్ మనకుండ వెప్పుడు నుషస్సౌరభ్యముల్ చూడఁగన్.