పుట:2015.392383.Kavi-Kokila.pdf/87

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

84 కవికోకిల గ్రంథావళి [సప్తమాంకము

సేనానీ, సైన్యతుములమువలన మునీశ్వరుల తపస్సులకు భంగము గలుగకుండునటు లరసికొనుము, సేనల సిద్ధపఱచి ప్రతిక్షణము నాయాజ్ఞకు వేచి యుండుము.

సేనా : దేవర యాజ్ఞాపించినట్లే. [నిష్క్రమించును.]

లక్ష్మ : [డగ్గఱి] బాలకా, ఆశ్రమ లతలను గొఱికివైచెనని యశ్వమును గట్టియుంచితివా?

కుశు : [చిఱునవ్వుతో] కాదుకాదు; ముఖపట్టమును దీసివైచుటకు.

లక్ష్మ : ఇది సవనాశ్వము సుమా !

కుశు : కాదని యెవరనిరి ?

లక్ష్మ : అట్లయిన నీవేల కట్టితివి ? ఆటలాడుటకుం దగిన లక్కబొమ్మ యనుకొంటివా దీనిని?

కుశు : కట్టినది లక్కబొమ్మయనికాదు. పదితలల రక్కసుని దునుమాడిన రాముని కెన్ని తలలుగలవో కనుఁగొనుటకు.

లక్ష్మ : [కోపముతో] ఏమీ ? పరిహాస మాడుచున్నావా?

కుశు : పరిహాసమో, చంద్రహాసమో మీకే తెలియవలయు.

లక్ష్మ : మునికుమారా, తెలియక నిప్పుతో చెర్లాటమాడుచున్నావు.

కుశు : నీటితో నిప్పునకేమి చెర్లాటము ?

లక్ష్మ : [స్వగతము] ఈ సౌందర్యరాశియగు ముద్దుకుమారుఁ డెవ్వని బిడ్డయో! మునితనయుని కిట్టి వాక్పటుత్వము, ఇట్టి సాహస మలవడి యుండునా ? [ప్రకాశముగ] బాలకా, యీవారువమును గట్టినవారు మాతోఁ బోరవలయును. నీవెవ్వరి కుమారుఁడవు ?

కుశు : యుద్ధమునకుఁ బూర్వము సంబంధబాంధవ్యము నెఱపుట మీయాచారము కాఁబోలు!

లక్ష్మ : [స్వగతము] ఈ ముద్దుకుమారునిఁ గాంచినంతనే నిర్హేతుకముగ నా యంతరంగము వాత్సల్య తరంగిత మగుచున్నది!