పుట:2015.392383.Kavi-Kokila.pdf/79

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

76 కవికోకిల గ్రంథావళి [షష్ఠాంకము

ణించెఁ గాఁబోలు!

కుశు : కాదు, కాదు; మనతల్లి మంగళసూత్రముధరించియున్నది.

లవు : [కొంతసేపూరకుండి] అన్నా తెలిసినది, తెలిసినది. మన తండ్రి యెచ్చటనో తపస్సు చేయుచుండవలయును.

కుశు : నాకేమియుఁ దోఁపకున్నది. మనకును ఇచ్చటి మునిబాలురకును చాలభేదము గనపట్టుచున్నది. వాల్మీకితాతగారు తక్కిన తాపస కుమారులకు శిక్షింపని బాణప్రయోగము మనకుమాత్రమె యేల నేర్పించిరి ?

లవు : మనలను క్షత్రియులను జేయుటకు.

కుశు : లవా, నీసమాధానము నాకు నచ్చలేదు. ఇందేదో కొంత దాపఱికమున్నది. ఎట్టులైన హటముపట్టి ఈరహస్యము నెఱుంగవలయును.

లవు : అవునవును; మనమిద్దఱమేడ్చి అన్నము దినకుండిన అమ్మ యీరహస్యము చెప్పకమానదు.

[నేపథ్యమున]

                     ప్రళయకాలాబ్ధి కల్లోలపటలిరేఁగి
                     పృథివిఁ గబళింపవచ్చెనాఁ బృథులసైన్య
                     మటవిఁగాల్మెట్ట భీతిల్లి యాశ్రమముల
                     కొక్కపెట్టునఁబర్వె మృగోత్కరంబు.

[కుశలవులు లేచి]

లవు : ఏమీ సైన్యమా ?

కుశు : ఆహా! తాతగారు చెప్పినట్లే అయినది. "నేనాశ్రమమున లేనిసమయమున రాక్షసులువచ్చి యజ్ఞవేదికలు పెళ్ళగింతురు. మునిపల్లె కొల్లగొట్టుదురు; జాగరూకులై యుండుఁడ"ని హెచ్చరించిపోయిరి. లవా,