పుట:2015.392383.Kavi-Kokila.pdf/74

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాంకము] సీతావనవాసము 71

యిక్కలు నేనెట్లు కనుగొందును? ఆ జడదారులు రాకున్న అశ్వమేధము చక్కగ నెరవేరదఁట! మేములేమా అయిదారువేదములు చదువుకొన్న మహా బ్రాహ్మణులము. అయిన నేమి? శంఖమునుండి జాఱిననీళ్ళే తీర్థమగును.

ఇచ్చట నలుదెసలకుఁ బలుమార్గములు పోవుచున్నవి. ఏదారిని పోయిన నే యరణ్యము సొచ్చి యేక్రూరమృగములవాతఁ బడుదునో అను భయమున నాగుండెలు దేవతార్చనగంటవలె గడగడ గొట్టుకొనుచున్నవి. అయ్యో, నేను తిరిగి దారపుత్రులఁ గాంచు భాగ్యముండునా? ఎట్లయిన నగుగాక! ఇట్టితఱి ధైర్యసాహసము లవలంబించి రెండవ పరశురాముఁడ నయ్యెదను. [నలుదెసలు పరికించి] ఈమార్గము వెడల్పుగను చక్కగనున్నది. అపాయము జరుగునెడల నిరాటంకముగఁ బరుగెత్తుటకుఁ దగియున్నది. [కొంతనడచి] అయ్యో సింహము ! సింహము! చచ్చితిని చచ్చితిని. వేదాధ్యయనపరుఁడను, బ్రాహ్మణుఁడను, రక్షింపుడు. రక్షింపుడు !

[లవుఁడు విల్లుభుజమునఁ తగిలించుకొని పూలబుట్టతో వచ్చును]

లవు : ఎక్కడ ఎక్కడ సింహము? [విల్లుచేతికందుకొనును]

యజ్ఞ : [గద్గదస్వనముతో] నాయనా, అదిగోసింహము. నిన్ను దైవము సమయమునకే పంపినాఁడు.

లవు : [విల్లెక్కు పెట్టి] ఓయి ఛాందసుఁడా! నాచేత మునిహత్య గావింపనెంచితివా?

యజ్ఞ : అబ్బాయీ, కాదుకాదు. అదిగో! సింహము పొదమాటున; గాలికి జూలెగురుచున్నది చూడు.

లవు : చూచి చెప్పెదను.

యజ్ఞ : నేనిక్కడ నుందును.

లవు : [చూడఁబోవును]

యజ్ఞ : మునికుమారా జాగ్రత, జాగ్రత.