పుట:2015.392383.Kavi-Kokila.pdf/69

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

66 కవికోకిల గ్రంథావళి [షష్ఠాంకము

మాండ : మేము మాట్లాడిన మీకు ఎగతాళిగనున్నది.

కుశు : తమ్ముఁడా, వీరు ధైర్యవంతులు. వీరితో చర్లాటము లాడఁబోకుము.

లవు : [ఒదుగుచు] సానందా, యీసింగముబారినుండి మమ్ము రక్షింపుము.

సానం : ఏమీ మమ్మెత్తిపొడిచెదరా ? మేము పిఱికివార మనుకొంటిరా? మా తల్లిదండ్రులు నిగ్రహానుగ్రహశక్తిమంతులు - శాపప్రయోగ దక్షులు !

కుశు : ఊ - ఊ! మాకు భయమెత్తుచున్నది. చీమలపుట్ట చూడు దాగుకొంటాము.

లవు : [నవ్వుచు] మాతాత ముత్తాతలుగూడ రాజ్యాలేలిన ప్రజ్ఞావంతులే!

మాండ : సానందా, నీవిఁక మాటాడక రమ్ము; అడవిమేఁకల పాలు ద్రావి వీరికి పొగరుపట్టియున్నది. వాల్మీకిపాదులవారి యాశ్రమమునకుఁ బోయి మనపయి సొడ్డులేకుండ వీరితల్లితోఁ జెప్పుదము.

సానం : అవును. పోదము పద.

[నిష్క్రమింతురు.]

లవు : అన్నా, తల్లిసింగమును తరుమగొట్టుము. ఈ చిన్నకూనను ఆశ్రమమునకుఁ దీసికొనిపోయి నివ్వరియన్నముపెట్టి సాకుదము.

కుశు : పాపము! ఆకొదమను విడిచిపెట్టుము. దానితల్లి యూరకే నీతట్టు చూచుచున్నది. మనతల్లిదగ్గఱనుండి మనలను బలవంతముగ వేఱుపఱచిన మనకును అమ్మకును ఎంతకష్టముగ నుండును.

లవు : అన్నా, మృగాలకుఁ గూడా అంతేనా ?

కుశు : అవునవును.

లవు : అట్లయిన వదలిపెట్టెదను. [కూనను ముద్దుపెట్టుకొనుచు]