పుట:2015.392383.Kavi-Kokila.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాంకము] సీతావనవాసము 61

[భరతుఁడు ప్రవేశించును.]

భర : అన్నా, లక్ష్మణుఁ డింకను రాలేదు.

రాము : ఏలరాఁడు ? ఇంతలో వచ్చియుండును. మరలఁబోయి కనుగొనిరమ్ము.

భర : [స్వగతము] అకటా! నిశ్చలమైన రాముని చిత్తమెంత లౌల్యము వహించినది?

[నిష్క్రమించును.]

రాము : వసిష్ఠమునీంద్రా, మీరు దివ్యదృష్టివంతులుగదా మా జానకి యేమైనదో చెప్పగలరా?

ఎంతవెఱ్ఱివాఁడను? ఏమైయుండును?

                     అకట! కంటక భూయిష్ఠమైన కాన,
                     గర్భభరమునఁ బార్ష్ణి భాగములు క్రుంగ
                     నడుగు నామడగా నల్ల నడుగులిడుచు
                     నడవిమృగముల కాహార మయ్యెయుండు!

మాతల్లి కౌసల్య 'వత్సా, నా ముద్దులకోడ లెక్కడ'యని యడగిన వన్యములకు బలివెట్టితి నమ్మాయని చెప్పుదునా? [దు:ఖించును]

వసి : రామచంద్రా, మిన్నులువడ్డచోటు పోవుకొలఁది నిరంతముగఁ బోవుచుండును. దు:ఖసాగర మీఁదుకొలఁది నిరవధికమై దోఁచుచుండును. ఏప్రజలు రంజమునకై ప్రియాంగనను విడనాడితిలో, రాజ్యకార్యముల నారయమి, ఆలోకులకే కష్టము వాటిల్లును. వత్సా, నీవు విధిజ్ఞుఁడవు. శోకింపక ధీరుఁడవుగమ్ము.