పుట:2015.392383.Kavi-Kokila.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

56 కవికోకిల గ్రంథావళి [చతుర్థాంకము

వాల్మీ : బిడ్డా, శంకింపవలదు. మీతండ్రి జనకరాజేంద్రుఁడు మా కత్యంత ప్రియమిత్రుఁడుగ నుండెను. మాయాశ్రమము నీ పుట్టినిల్లుగఁ దలఁచుకొనుము. శీఘ్రకాలమున నీవు వీరమాత వయ్యెదవు.

సీత : [కన్నీటితో] మునీంద్రా, నాపరీభవమును మాజనకుఁడెఱుంగక మున్ను తపోవనవాసి యయ్యెను. లేకుండిన నాకొఱ కెట్లు పరితపించి యుండునో!

వాల్మీ : కుమారీ, విచారింపకుము. నీ వాసన్న సత్వవు. మార్గాయాసమున బడలియున్న దానవు. అరణ్యసహజమగు నాతిథ్యముంగొని విశ్రమింతువు రమ్ము.

సీత : [స్వగతము] తాపసులు నిర్హేతుక వాత్సల్యవంతులు ! [ప్రకాశముగ] మహాత్మా, నే నేమహర్షిచేఁ గరుణింపఁ పడితిని ?

వాల్మీ : వత్సా, నన్ను వాల్మీకి యందురు.

సీత : [స్వగతము] ఈపవిత్రనామమును మున్నే వినియుంటిని. [ప్రకాశముగ] తాపసోత్తమా, యీ దిక్కులేని దానిని రక్షించితిరి.

వాల్మీ : బిడ్డా, అందఱను రక్షించుటకు సకలాంతర్యామి భగవంతుఁ డొకఁడు గలఁడు. పోదము రమ్ము, కాలవిలంబునంబునఁ దపోంతరాయము గలుగును.

సీత : మీచరణముల ననుసరించుచున్నాను.

              [స్వగతము] దరియు దాపులేక తరఁగ లుల్లోలించు
                              జలధి మధ్య నావ సడలి క్రుంక
                              మునుఁగనున్న నావికునికిఁ జెక్కవిధానఁ
                              బ్రాప్తమయ్యెఁ దాపసాశ్రయంబు.

[నిష్క్రమించును.]