పుట:2015.392383.Kavi-Kokila.pdf/47

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

44 కవికోకిల గ్రంథావళి [చతుర్థాంకము

సీత : [నిరూపించి]

                       ఆశ్రమకురంగ మల్లదే ! యఱుతఁబూల
                       మాల వ్రేలాడ సెలయేళ్ళ కూలములను
                       గప్పురము లట్లు నురుగులు గాఱుచుండ
                       మిసిమి పచ్చిక జొంపంబు మేయుఁ గనుము !

లక్ష్మ : అమ్మా, ఈవనసౌభాగ్యము దిలకించుకొలఁది యీప్రాంతములు తాపస నిలయములుగఁ దోఁచుచున్నవి.

                      వనహోమోద్గత ధూమధూమ్రములు పర్ణంబుల్‌ధరాజంబులన్
                      బువుగుత్తుల్ మునిబాలికాపచితముల్ పూజార్థ, మిక్కానలో
                      సవనాజ్యామల సౌరభంబులొలుకున్ సర్వంబు; వేయేల? మౌ
                      ని వరుల్ కాఁపురముండు చిహ్నములురాణించున్ విశేషంబుగన్

సీత : వత్సా, మనము పోవలసిన తపోవన మెంతదూరముననున్నది?

లక్ష్మ : ఈ భాగీరథీ పరిసరారణ్యముననే కొంత దవ్వేఁగవలయు

సీత : అటులైన నేనిఁక నడవఁజాలను. ప్రొద్దుటినుండియు నేదో మనోవికారము ననుఁ గలఁచుచున్నది. రాత్రియంతయు నిదుర పట్టియుఁ బట్టకయుండుటవలన అవయవముల బడలిక యింకను దీఱదు. అదియుంగాక సూర్యతాపము హెచ్చుచున్నది. కొంతసేపీ శీతల తరుచ్ఛాయల సేదదీర్చికొని మెల్లగఁ బోవుదము.

లక్ష్మ : అటులనే విశ్రమింపుము. దప్పిగొనియున్న - [అర్థోక్తియందె.]