పుట:2015.392383.Kavi-Kokila.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాంకము ] సీతావనవాసము 33

జానకి లేక రామునికి నునికిగలదా ? కఠిన హృదయమా, నీకార్యము నిర్వర్తించితివి. ఇఁక రాముని సంసార మసారమైనది.

హా ! వనవాసప్రియసఖీ జానకీ, నిన్నుఁ గానలకంపి నేనెట్లు బ్రతికి యుందును ? పదునాలుగేడులు ఘోరకాంతారముల నివసించియు నీవు నన్నుఁ గూడియుండుటఁగదా యాపదలెల్ల సౌఖ్యములుగను. అరణ్యమే యయోధ్య గను జూపట్టినది. నీవు దైత్యాపహృతవైనప్పుడు గదా నాకు యథార్థమైన యరణ్య నివాసము.

ప్రాణప్రియా, యీక్రూరాత్ముని యుపబోగ్య హారవల్లికయని గ్రహించితివి; విషవ్యాళమై కఱవనున్నాఁడు.

                     దేహముననుండి హృదయమ్ముఁ దీసివైవ
                     హృదయ దేహమ్ము లెడమౌట బ్రతుకఁ గలవె?
                     నాదు నర్ధాంగి సీత ననాదరమునఁ
                     గాన కంప మాయిద్దఱి గతులిఁ కేమొ !

జానకియందు లోకమేగాదు అపరాధి; ఈకారుణ్య రహితుఁడు రాముఁడుకూడ !

                     ప్రియుఁ డటంచును, సౌందర్యమయుఁడటంచు,
                     ధీరుఁడనుచును, ద్రైలోక్య వీరుఁడనుచు
                     నెవని నమ్మి కరాంబుజ మిచ్చినావొ
                     ఆ కులాంతకుఁడే కానకంపు నిన్ను.

సీతా, మదేకజీవితా, నేను జీవించియు నీ వనాధవైతివా ? [దు:ఖించును.]

[యవనికజాఱును.]