పుట:2015.392383.Kavi-Kokila.pdf/35

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

32 కవికోకిల గ్రంథావళి [తృతీయాంకము

రాము : తమ్ముఁడా, సజ్జనుల కత్తిపోటులకన్నను దుర్జనుల నాలుక పోటు లతి క్రూరములు.

లక్ష్మ : అన్నా, అపూర్వ మీ ఘోరశిక్ష.

రాము : ఇక్ష్వాంకువంశకీర్తి దిగంతవిశ్రాంతము. ఈయపవాదము తూలరాశింబడిన యగ్నికణమువలె సకలదిక్కులకు వ్యాపించును.

లక్ష్మ : మీకు ధర్మము నుపదేశించునంతటి కోవిదుఁడనా ?

రాము : ఉపదేశించియు నిరుపయోగము.

లక్ష్మ : [స్వగతము] అయ్యో ! యిఁక నేనేమి సేయుదును ? [ప్రకాశముగ] అన్నా, దేవి ఆపన్న సత్వ,

రాము : ఈక్రూరాత్ముని చిత్తము పాషాణసదృశము.

లక్ష్మ : వెనుక చింతించియు - [అర్థోక్తియందె]

రాము : లక్ష్మణా, కర్మఫలానుభవ మెవ్వరికిందప్పదు. కార్యము నిశ్చితము. ఆజ్ఞను పాలింపుము.

లక్ష్మ : [స్వగతము] వినయముచే నిరుత్తరుఁడనైతి [ప్రకాశము] మీయిష్టానుసారము ప్రవర్తించెదను.

రాము : దండకారణ్య నివాసినులగు తాపసబాలికల దర్శింప సీత యభిలషించినది. నేఁడే ప్రయాణము సాఁగింపవలయు.

లక్ష్మ : [దు:ఖముతో] అన్నా ! మఱియొక్క మాఱీ -

రాము : లక్ష్మణా, యిఁక మాఱాడిన నాయాన గలదు. అగ్రజుని పనుపుసేయుము. పొమ్ము.

లక్ష్మ : [స్వగతము] ఎఱిఁగి యెఱిఁగి నేనీ ఘోరకృత్య మెట్లొనరింతును? హా ! పాపపుదైవమా నీకెంత నెనరులేక పోయె. [నిష్క్రమించును.]

రాము : [దు:ఖముతో] ఔరా ! యెంతటి కాఠిన్య మారోపించుకొన్నను శోకభారమున నాచిత్తము క్రుంగుచునేయున్నది. పత్నీవిరక్తుఁడ నగుటయే గాక యనుజ తిరస్కారియుం గావలసె.