పుట:2015.392383.Kavi-Kokila.pdf/315

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాంగ్రెస్‌వాల

రంగా : [చిఱునవ్వుతో] తలిస్‌మాన్ తాయెత్తా?

కళ్యాణ : కాదండి. [రహస్యముగా చెప్పువానివలె] అదృష్టవశాత్తుగా ఆశ్రమంలో అమ్మగారి వెంట్రుక ఒకటి దొరకింది. దాన్ని బంగారు తాయెత్తులోవేసి మొలకు కట్టుకొన్నాను. ఏ చీడాపీడా ఆశించదు.

వెంకట : ఓ! [నవ్వుచు] అందువల్లనే ధైర్యంచేసి వచ్చారు.

రంగా : Yesǃ It is faith cure.

కళ్యాణ : వీళ్ళు లోకాన్ని తాము వుద్ధరిస్తూన్నామని అనుకొంటారు. ఆ దివ్యశక్తి ప్రపంచ చక్రం నడపుతున్నది. పుట్టించేదెవరు? చంపేదెవరు? రోగాలు భూకంపాలు, విప్లవాలు, యుద్ధాలు నేచరుస్కీమ్ (nature Scheme)లో వుండేవే. ఇవిలేకపోతే నేచరులో ఈక్విలిబ్రియం (equilibrium) వుండదు. ఆత్మకు ఎప్పటికి నాశనం లేదు.


                   నైనం ఛిందంతి శస్త్రాణి, నైనం దహతిపావక:,
                                    అనిన్నీ -
                   వాసాంసి జీర్ణాని యథావిహాయఁ నదాని
                   గృహ్ణాతినరో౽అపరాణి -

అనిన్నీ గీతాశాస్త్రమే చెబుతున్నది. మామహర్షి అందువల్లనే (social service) వుత్తమిధ్య - బూటకమని దాన్ని బహిష్కరించాడు.

రంగా : [సిగరెట్టుముక్క క్రిందపడవేయును.]

కళ్యాణ : [అటుపోయి సిగిరెట్టుముక్కను త్రొక్కి యెగిరిపడి] అబ్బా! తేలుకుట్టింది. [సిగరెట్టుముక్కను చూచి కోపముతో] ఏమండి, మనుష్యులు తిరిగేచోట ఆర్పకుండా సిగిరెట్టుముక్కలు పడవేస్తే కాళ్ళు మండుకపోతవని తెలియదూ?