పుట:2015.392383.Kavi-Kokila.pdf/304

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కవికోకిల గ్రంథావళి

అయ్య : [వాకిలిదగ్గఱకు పోయి] ఏమండో, డబ్బు ఎగనూకి పోతున్నారే!

కళ్యాణ : [తిరిగివచ్చి డబ్బు ఇచ్చును]

రంగా : కాంగ్రెసువాళ్ళ మాటలకు తలా తోకవుండదు లేండి. ఇన్‌ష్యూరెంసు ఏజెంట్లులాగ ఎక్కడచూచినా యీకాంగ్రెసుగూడెము వారె హాజరౌతారు. వీళ్ళమాటలకు కోపపడితే మనషి బ్రతకడం దుర్ఘటం. కూర్చోండి.

కళ్యాణ : [కూర్చుండును]

రంగా : వీళ్ళకు గాంధీతప్ప మరెవ్వరు పనికిరారు. ఆ గాంధీ వల్లనే స్వరాజ్యం రాకుండాపోయినసంగతి కూడా వీళ్ళకు తెలియదు. మా టాగూరు ఇంగ్లాండుకు పోయినప్పుడు ఆయన్ని చూచి అందరు ఓరియన్‌టల్ క్రైస్ట్ (Oriental Christ) అని ఆరాధించారు. ఆయన flowing silver beard, పట్టు అంగీ సర్వజన వశీకరణం చేశాయి. చాలమంది ఇంగ్లీషుకన్యలు ఈయన ముసలివాడు కాకుండావుంటే పెండ్లిచేసుకొని వుందుము గదా అని చింతించినారట! ఈలాంటి మహానుభావులు పుట్టిన దేశానికి స్వరాజ్యం యివ్వవలసిందని లేబరువాంళ్లు పట్టుబట్టితే అప్పుడు మ్యాగొనాల్డుకు మెజారిటీలేక ఆ తీర్మానం ఓడిపోయిందట. గాంధీ రౌండ్టేబిల్ కాన్ఫరెన్‌సుకు పోవడమువల్ల మనదేశానికి పరమ అన్యాయం జరిగింది. మోకాళ్ళకుపైగా ఖద్దరుగుడ్డ యెగదీసి కట్టి ఒక పెద్ద మోటు దుప్పటి పైన కప్పుకొని పెద్ద 'బూర్‌' (boor) లాగా తయారై అక్కడికి వెళ్ళేటప్పటికి ఆయన్ను చూచినవాళ్ళందరు India is uncivilised; India is unfit for Dominion Status అని అరిచారు. ఇంగ్లీషు కన్యలందరు ఒక కమిటీ గట్టి గాంధీ ఇంతకంటె futher ఫర్‌దరుగా డ్రెస్ రిఫారం (dress-reform) చేయగూడదని హోరుదగ్గరికి డెప్యుటేషన్ వెళ్లినారట. కన్‌సర్‌వెటివ్ పక్షంవాళ్లు ఈ సమయం అనుకూలంగా వుందని గాంధీ ఫోటోను