పుట:2015.392383.Kavi-Kokila.pdf/301

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాంగ్రెస్‌వాలా

మీస్థూలదృష్టికి ఏది వికారంగా కనబడుతుందో, ఆయన అంతశ్చక్షువుకు అది రమణీయంగా కనబడుతుంది. మీ కేది త్యాజ్యమో ఆయన కది పూజ్యము.

కళ్యాణ : [రెండు చిటికెలు అటుకులు నోట్లో వేసుకొని నమలుచు] గాంధీ ఆర్టిస్టు కాకపోవడంవల్ల మనకేం బాధలేదు. అయితే పవిత్రమైన ఆధ్యాత్మిక తత్త్వాన్ని పాలిటిక్‌స్‌తో సాంకర్యం చేసి రచ్చకీడ్చి నానా గోలపెట్టాడు. హిందూదేశం పూర్వం పరమఋషులున్న తపోభూమి. ఇప్పటికికూడా మా మహర్షివంటి మహనీయులు అక్కడక్కడ లేకపోలేదు. ఇటువంటి పవిత్రమైన ఆధ్యాత్మిక వాతావరణంలో రాక్షసమైన (politics) పాలటిక్సును తెచ్చి పెట్టి దేశశాంతికి భంగం కలిగించాడు గాంధి. అందువల్లనే మా మహర్షి పుదుచ్చేరి వదలి రావడం లేదన్నాడు. ప్రపంచాన్నంతా ఆధ్యాత్మికంగా ఒక్క సారి వుద్ధరించడానికి మాగురుదేవుడు ఆ దివ్యశక్తిని పాపభూయిష్ఠమైన యీ ప్రపంచంలోకి అవతరింప జేస్తున్నాడు. అది సూర్యమండలం దాటింది; చంద్రమండలంలోకి ప్రవేశించింది; ఇక కొన్నిదినాలకు మేఘమండలంగూడా వ్యాప్తిస్తుంది. అప్పటికి మన హృదయాలన్నీ చాలా (receptive state) రిసెప్‌టివ్ స్టేట్ లో వుంచుకో వాలె. పాలిటిక్‌స్ దానికి ప్రతిబంధకం.

వెంకట : అయ్యర్ - కాఫీ.

రంగా : ఎందుకండీ.

వెంకట : తాగడానికి.

రంగా : మిమ్ములను గాదండి.

కళ్యాణ : పాలిటిక్సు (politics) యీ లోకానికి సంబంధించిన గోల; మానవశరీరం క్షణికం; ఇక దానికి సంబంధించిన ప్రతిదీ క్షణికమె. ఆ దివ్యశక్తి క్రిందకు అవతరిస్తే ఒక్క హిందూదేశమే గాదు; ప్రపంచానికంతా ముక్తి గలుగుతుంది.