పుట:2015.392383.Kavi-Kokila.pdf/296

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కవికోకిల గ్రంథావళి

ఫోను, ప్లేట్లు, ఎలక్‌ట్రిక్ ఫ్యాన్ (fan) పెట్టబడియుండును. తెరయెత్తునప్పటికి ఎంగిలి ప్లేట్లు - తామరాకులతో నిండిన టేబిలు కనబడును.

రంగారావు ప్రవేశించును. ఈయన వయస్సు షుమారు ఇరువదిరెండు సంవత్సరములుగ నుండును. చెవులమీదికి వ్రేలాడు పొడుగాటి క్రాపు వెండ్రుకలు, కంటికి 'ప్రిన్సునెజ్‌' సులోచనములు, వేస్టుసిల్కు పక్కజోభీ కుడితిని, సిల్కుకద్దర్ బెంగాలీకప్ప, చేతి గడియారము, కుడిచేత జపానుదేశపు ఎదురుకఱ్ఱ, ఎడమచేత (hand camera) చేతిక్యామర ఇవి రంగారావు అనివార్య బాహ్యలక్షణములు; అలంకారములు.]

రంగారావు : అయ్యర్. [ఎవరు పలుకరు.] [సులోచనములు సర్దుకొనుచు నలువైపులచూచి] ఈహోటళ్ళుకూడా మన భాగ్యవంతుల బంగళాలాగే పటాలంగళ్ళుగా తయారయ్యాయి. డెకరేషన్(decoration) కూడా వొక ఆర్టని, ఆర్డరు - అరేంజిమెంటు - టేస్టు - అనేవి ఈప్రపంచములో వున్నాయని వీళ్ళకు తెలియకపోవడం ఘోరం. [ఈగలు మూగుచున్న ఎంగిలి ప్లేట్లను తామరాకులనుచూచి] పూర్వకాలంలో తామర పూవులపైకి తుమ్మెదలు మూగి ఝుంకారం చేస్తూవుండేవని కవులు వర్ణించేవారు. ఇప్పటి కవులు, ఈలాంటి హోటళ్ళలో ఎంగిలి తామరాకులపైకి మూగే ఈగల అవ్యక్తమధుర గానాన్ని అభివర్ణించవలసి వుంటుంది. - అయ్యర్ - [కఱ్ఱతో టేబిలు తట్టును.]

అయ్యర్ : [ప్రవేశించి] కూసుకోండిమి. ఏం తెచ్చేదండి.

రంగా : ఆ సంగతి తర్వాత, ముందు ఈకవితా సామగ్రిని తీసి వెయ్యించండి.