పుట:2015.392383.Kavi-Kokila.pdf/269

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కవికోకిల గ్రంథావళి

కొంత ద్రవ్యమును ఆయత్తపఱచియున్నాను. తప్పించుకొని వెడలిపొమ్ము. ఎచ్చటనైన పరదేశమున బ్రతుకవచ్చును. ఎంతటి అవివేకియైనను ఇట్టి యనుకూల సమయమును వ్యర్థపుచ్చఁడు. రమ్ము, రమ్ము. [చేయిపట్టుకొని లాగికొని పోఁబోవును.]

మాధ : [చేపట్టు వదలించుకొని] ఏమి? - నేను దొంగవలె పాఱిపోవలయునా?

                       ఆతతాయి యన్న యంక మామరణంబు
                       చాకివాని ఖరము నాటిమోసి
                       భారభూతమైన బ్రతుకు సంరక్షింప
                       యశముకన్నఁ బ్రాణ మంత తీపె?

విజ : తొందరపడుము; కానిమ్ము, కానిమ్ము. వెనుకముందు లాడకుము. నీ ప్రాణము - తరుణము.

మాధ : నా నిరపరాధిత్వమును మీరు శంకించుచున్నారా?

విజ : [విసుఁగుతో] వ్యర్థప్రసంగము - వెడలుము. నీకు జీవితము పైన ఆసయున్నట్లులేదు.

మాధ : నన్ను మీరు కనికరించి తప్పింపవచ్చితిరా? మీ సదుద్దేశమునకు కృతజ్ఞుఁడను కాని, మీ సాహాయ్యము నంగీకరింపఁజాలను. సర్వసాక్షియైన భగవంతుఁడొకఁడు కలఁడు. ఆ కరుణామయుఁడు నన్నిట్లు నిస్సహాయునిగ వదలి పెట్టఁడు.

విజ : ఓరీ బాలిశుఁడా! - పరస్పరకబళనొద్యత ప్రాణిసంకులమైన యీప్రపంచము - నిశ్చేత సాంధకారశక్తి ప్రేరిత భూతప్రళయ నాట్యరంగమైన యీప్రపంచము - కరుణామయుని సృష్టియనుట కల్ల, అవివేకము.