పుట:2015.392383.Kavi-Kokila.pdf/254

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మాధవ విజయము


శాంత : [తత్తరముతో] ఏమీ! ఏమిజరిగినది?

మాధ : నేను అరణ్యమున కెఁగునప్పటికి మనోరమయు దాసియు నచ్చట నుండిరి. నే నామె యొద్ద సెలవు పుచ్చుకొనుచుంటిని, అంతలో విజయవర్మ గారును రాజశేఖరుఁడును అచ్చటకు వచ్చిరి. ఆఁతడెట్లు నన్ను నిందించినదియు వీరెఱుంగుదురు.

విజ : పాపము! మాధవవర్మగారు చాల యోర్పువహించి యుండిరి. [స్వగతము] మూఢుఁడా, నీ సత్యభాషిత్వమె నీమెడకు నురిత్రాడును బిగించును లెమ్ము.

మాధ : నన్ను సాఁకి సంతరించినవారియెడ కృతఘ్నుఁడనుగనుండఁ జాలను. నావలన మీకుటుంబ శాంతికి భంగమేల కలుగవలయును? నన్ను విడనాడుఁడు. రాజశేఖరుఁడు తిరిగివచ్చునప్పటికి నే నింట నుందు నేని ఆతఁడు నన్నొక మనుష్యునిగ లెక్కింపఁడు.

[ఇరువురు పరిచారకులు ఒక విరిగిన కత్తిముక్కను, తలపాగను తీసికొని ప్రవేశింతురు]

ఒకపరిచారకుఁడు : [దు:ఖగద్గద స్వరముతో] పొద్దున్నే పోయి మల్లీ అడివంతా గాలించి గాలించి వెతికినాం పుట్టపుట్టా చెట్టుచెట్టూ సూశినాం. అరణ్యకుల్యానదికి దగ్గిరగా ఈకత్తితునక, యీతలగుడ్డ పడివుండింది.

శాంత : [ఆతురతతో] ఏవి! ఏవి!

[చేతులు చాఁపును. పరిచారకులు తలగుడ్డను కత్తిముక్కను అందింతురు.]

విజ : ఇది నిన్న రాజశేఖరవర్మ చుట్టుకొనిన తలపాగవలెనున్నది.

శాంత : [తలగుడ్డను కౌఁగిలించుకొని దు:కించుచు] అయ్యో! నా బిడ్డ నెవరో చంపిరి. కత్తితునుక నెత్తురు తడిసియున్నది. అయ్యో! నాయనా,