పుట:2015.392383.Kavi-Kokila.pdf/237

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కవికోకిల గ్రంథావళి

దుర్వినియోగ పెట్టుచున్నాఁడు. నాయెదుటకూడ మనోరమతో స్వేచ్ఛగ మాటలాడుచుండును. వారిరువురు పాచికలాడునప్పుడు నేను కోరినను వారు నన్ను ఆటలోనికి రానియ్యరు. వారిరువురి కలుపుఁగోలుతనము నా కేవము పుట్టించుచున్నది.

యశో : కుమారా, పిన్నటినాఁటనుండియు మీరు ముగ్గురొక్క చోట పెరిగితిరి. ఒక్కకంచమున గుడిచి, యొక్కమంచమున నిదురించితిరి. మొన్న మొన్నటి వఱకు పరమాప్తులుగ నుంటిరి. మాధవుఁడు నీ యసూయకు పాత్రుఁడు కాఁడు. గొప్పబుద్ధివహింపుము. మనోరమ యింకను బాల్య వినోదముల విడనాడదు.

రాజ : అమ్మా, నీ వేమైన ననుకొందువుగాక, నేను మాత్ర మొక మాటచెప్పుచున్నాను: ఇఁకమీఁద మనోరమ మాధవునితో కలసిమెలసి యుండరాదు. నీకుమారిక ప్రవర్తనమునకు నీవు బాధ్యురాలవు. తెలిసికొమ్ము.

[నిష్క్రమించును]

యశో : ఇఁకమీఁద వారిరువురు కలసిమెలసి యుండరు. రాజశేఖరుఁడు తండ్రియంతవాఁడు. పట్టినపట్టు విడువఁడు. అయ్యో, మాధవా, నీ వెప్పుడైన వెడలవలసినవాఁడవేనా! ఏపల్లెతయో పెంచుకొనియున్న నీకిట్టి యిక్కటులు వచ్చియుండవుగదా! రాజశేఖరుని యుద్దేశ మటుండనిచ్చి మనోరమకును మాధవునకుఁగల చనవును కొంతమట్టుకు తగ్గించుటయే యుచితమని నాకును దోఁచుచున్నది . వారిరువురికి పరిణయము దుస్సాధ్యము! అట్టియెడ పరస్పరానురాగము హృదయానుతాపమునకు మూలము కాఁగలదు. అన్యాపదేశముగ మాధవున కీ సందర్భములన్నియు తెలియఁజెప్పెదను.

[నిష్క్రమించును.]

[తెర జాఱును.]

________