పుట:2015.392383.Kavi-Kokila.pdf/215

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

222 కవికోకిల గ్రంథావళి

రహస్యము లెఱుఁగఁదగునంతటి విశ్వాసపాత్రుఁడను కాకపోయితిని. పనిదీఱిన వెనుక పనిముట్టు త్రుప్పుపట్టుటలో నాశ్చర్యమేమి గలదు?

విజ : సమరసేనా, కొలఁది దినములనుండియు నిష్ఠురముగ మాటలాడుట నీ కలవాటుపడిన ట్లున్నది. నాలోపము నాధారము చేసికొని నాస్నేహితమును నీచముగ దుర్వినియోగపఱచుచున్నావు. నీసాహాయ్యమునకు తగిన యుపకారము నొనర్చితిని. మాయన్న గారి పరిపాలనా సమయమున తక్కువ యుద్యోగమునందున్న నీకు క్రమక్రమముగ సైన్యాధిపత్యము నొసంగితిని. నీకింకను తృప్తికలుగదు. వివేచనా రహితమైన నాయంగీకారమె నీయత్యాశకు సోపానమైనట్లున్నది.

సమ : ప్రభువు లేమి మాటాడినను న్యాయముగనే యుండును. ప్రయోగదక్షులు ఫలసిద్ధికొఱకు ఎంతటికార్యములనైన నొనరింతురు. ఉదారహృదయులైన మీరు కనికరించి నాకు మహాదానమొనరించితిరని యనుకొండు.

విజ : నీ యుద్యోగము నీయోగ్యతకు తగిన బహుమతియనుకొంటివా?

సమ : నా సాహాయ్యమునకు మించని పదవియనుకొంటిని.

విజ : [స్వగతము] నాగుట్టంతయు వీనిచేతిలోనున్నది. విరోధ మపాయకరము. [ప్రకాశముగ] సమరసేనా, నీవు చెప్పినది యథార్థమె. నీఋణము పూర్ణముగ నేను తీర్చుకొనఁజాలను. మనయిరువురిలో నొకరి కొకరికి తెలియరాని రహస్యములులేవు.

సమ : [స్వగతము] విజయవర్మ నా ప్రాముఖ్యము నిప్పుడు గుర్తెఱుఁగుచున్నాఁడు. [ప్రకాశముగ] శాంతవర్మగా రింట మీ రేల బసచేయవలయును?

విజ : శాంతవర్మకు రమణీయవతియైన యొక కుమారిక కలదు. నే నా కాంతను బెండ్లియాడఁ దలంచుకొంటిని.