పుట:2015.392383.Kavi-Kokila.pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

216 కవికోకిల గ్రంథావళి [స్థలం పదనొకండు

వైతివి. సంశయ గ్రస్త చిత్తుఁడనై బ్రతికియుండుటకన్న సత్యమెఱుంగుట కాస్పదమైన యీ మరణమె సుఖవంతము. అగ్బర్, నా మీరా యేమైనది?

అగ్బ : ఆ పతివ్రతా శిరోమణి యమునాగర్భము నాశ్రయించినది.

రాణా : [గద్గదస్వరముతో] హా! పరమ పాతకుఁడను. ఆ అమాయికను నిష్కారణముగ హింసించినందులకు దు:ఖించెదను. మందమతినై తప్పుజాడపట్టితిని. స్వయంకృతాపరాధమునకు తగిన చరమశిక్ష ననుభవించు చున్నాను. - అబ్బా, భ్రమ కప్పుచున్నది. - మీరా - మీరా - క్షమాపణము వేడికొనుటకై నీయొద్దకే వచ్చుచున్నాను. - పాపాత్ముఁడనని పెడ మోము పెట్టకుము. నీ యెదుట నంజలి బద్ధుఁడనై నా యపరాధము నొప్పుకొందును. మీరా - మీరా - మన్నింపుము - కనికరింపుము - మీ - రా - మీ - రా - రా - రా - [మరణించును.]

అగ్బ : రాణా మరణమునకన్న నా బ్రతుకే శోచనీయము. ఆతఁడొక్కసారియే మరణించెను. నేను ప్రతిక్షణము మరణవేదన ననుభవించు చున్నాను.

తాన్ : మృత్యువు దైవముయొక్క అమోఘాస్త్రము.

అగ్బ : అజ్ఞాతముగ మన మీ ఘటనావర్తములోని కీడ్వఁబడితిమి.

                      పరమభక్తురాలి పదములు సేవింప
                      భక్తితోడ నిటకు వచ్చినాఁడ,
                      దైవఘటన మెట్లు తలపోతు? మరలెద
                      రక్తసిక్తమౌ కరంబుతోడ.

                                                                             [తెరజాఱును.]

సంపూర్ణము.

29-10-1924

______:(0):_______