పుట:2015.392383.Kavi-Kokila.pdf/205

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

214 కవికోకిల గ్రంథావళి [స్థలము పదునొకండు

తండ్రీ, మన్నింపుము. మన్నింపుము. - విధి - చేష్ట - వి - ధి - చే - ష్ట - [మరణించును.]

రాణా : [తరుకాండము క్రిందికిజాఱి] కుమారా, స్వామిభక్తున కనురూపమె నీప్రాణ పరిత్యాగము, ప్రయోజనమేమి? నావైన ఏల బ్రతుకవు? తలంపని చోటనుండి కులిశాఘాతము! ఎంత ఘటనా వైపరీత్యము.

ఓరీ, అగ్బర్, నీకింకను మంచి దినములుగలవు; నీవు బ్రతికితివి. నే నిప్పు డశక్తిమంతుఁడను. ఒక్క నిమిషములో మరణింపనున్నాను. కాని, నీకుమాత్రము దండనము తప్పదు. నా యవమానమును కులావమానముగఁ దలంచిన యే రసపుత్ర వీరుఁడైనను నా మనో నిశ్చయమును నెరవేర్పఁగలఁడు. రక్తజ్వాలా భయంకరమైన నా యభిశాపము పిడుగువలె నీ తలపై ప్రేలఁ గలదు.

[అగ్బరు తాన్ సేనులు ప్రవేశింతురు.]

అగ్బరు : ఎవఁడో వేదనా భరితుఁడు నన్ను నిందించుచున్నాఁడు. [దగ్గఱి] అయ్యా. మీ రెవ్వరు? అగ్బరు నేల శపించుచున్నారు?

రాణా : [వేదనా గద్గదస్వరముతో] ఆ పరమపాతకుని నామమును మీ రేల యుచ్చరించెదరు? ఆమొగలాయి కులకలంకుఁడు నన్నారడిపుచ్చి నా యిల్లాలిని దొంగిలించుకొని ఢిల్లీకి పాఱిపోవుచున్నాఁడు.

తాన్‌సేన్ : ఇదియేమి భ్రాంతి ?

అగ్బ : మీకేల యింత దురవస్థ కలిగినది?

రాణా : విపరీత సంఘటనము.

అగ్బ : అగ్బరును చంపింప నెంచి మీరే చంపఁబడితిరా?

తాన్ : పాదుషాకు ప్రాణాంతకమైన గండము తప్పినది.

అగ్బ : కుంభరాణా.

రాణా : నారాజ్యమున నన్ను బేరుపెట్టిపిలచు మానవుఁ డెవ్వడు?