పుట:2015.392383.Kavi-Kokila.pdf/201

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

208 కవికోకిల గ్రంథావళి [స్థలం తొమ్మిది

అగ్బ : చిమ్మచీఁకటి.

మీరా : ఇదియె యభిసరించుటకు దగిన సమయము.

అగ్బ : నిన్నంత శ్రమ పాలుచేసిన యాకఠిన హృదయుఁ డెవఁడు?

మీరా : నా ప్రాణేశ్వరుఁడు.

                     అఖిల భూభువన పట్టాభిషిక్తుండయ్యుఁ
                             బసుల మేపుట కిష్టపడియె నెవఁడు?
                     బ్రహ్మాండ సంసార బంధముక్తుండయ్యుఁ
                             దల్లి బంధములలోఁ దవిలె నెవఁడు?
                     గోపాంగనా ప్రేమ గోష్ఠీ రతుండయ్యు
                            నిర్మల జ్యోతియై నెగడె నెవఁడు?
                     నిర్జీవ వేణు ప్రణీత గీతుండయ్యు
                            ఱాల నాత్మల రేపఁజాలె నెవఁడు?

                     బర్హిపింఛంబు హొంబట్టు వలువతోడ
                     విశ్వమోహన మూర్తియై వెలిఁగె నెవఁడు?
                     అట్టి శ్రీకృష్ణుఁడే నాకు నాత్మవిభుఁడు;
                     అతని యన్వేషణమె జీవితాంత్య ఫలము!

అగ్బ : ఆ! తల్లీ, ఈపాతకులను మన్నింపుము. [ఇరువురు పాదముపై వ్రాలుదురు]

మీరా : అయ్యలారా, లెండు! మీ రెవ్వరు?

అగ్బ : మీ నిర్హేతుక మరణదండనమునకుఁ గారకులమైన రాక్షసులము.