పుట:2015.392383.Kavi-Kokila.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్థలము ఎనిమిది] కుంభ రాణా 201

సేనా : [ఆశ్చర్యముతో] మరణ దండనమా ! ఎందులకు ?

రాణా : [కోపముతో] ఏమీ? యీ యాజ్ఞా విమర్శన మహామారి యందఱకు వ్యాపించి నట్లున్నది ! - అది నాయుత్తరువు.

సేనా : అమాత్యు లంతటి యపరాధ మేమిచేసిరి?

రాణా : [కోపము నడచుకొనుచు] ఆ విచారము నీ కనవసరము నా పనుపు సేయుము, పొమ్ము.

సేనా : నిరపరాధులను నేను హత్య చేయఁజాలను.

రాణా : ఇది హత్యకాదు. దండనము.

సేనా : నిర్హేతుకమైన దండనము బలాత్కార హత్య.

రాణా : [విసుగుతో] ఇంక వేఱేమి హేతువు కావలయును? సతీత్వమర్యాదను అతిక్రమించిన మీరాకు మరణశిక్ష విధించితిని. అమాత్యులు నాయాజ్ఞను తిరస్కరించిరి.

సేనా : అపరాధ మొనరించినది అగ్బరు, అతఁడు దండ్యుఁడు.

రాణా : [కోపముతో] నీవు నాకు ధర్మోపదేశము చేయునంతటి పండితుఁడవైతివా? అమాత్యులయొద్ద శిక్షపొందితివా ?

సేనా : అపరాధులే దండ్యులగుట న్యాయమని మనవి చేసితిని.

రాణా : ఇరువురును దండ్యులె. ఆ అగ్బరును మాత్రము వదలిత నను కొంటివా ? ఆ దురాత్ముని రక్తపూరము మాయంత:పురమునఁ జల్లించి అంటు వాపెదను. మీరాను శిక్షింపనిదే లోకము సంతృప్తిపడదు - ఈ యనవసర కాలయాపన మెందుకు ? - నాయాజ్ఞను నిర్వహించెదవా? లేదా? - ఒక్కమాట.

సేనా : సంగ్రామభూముల విరోధికంఠ నాళముల నిష్కరుణముగ చెండాడితిఁగాని, ఎన్నడును నిరపరాధులను హత్యగావించి యెఱుఁగను. మీరు నన్ను నిర్భందించుదురేని ఇదిగో! నాయధికార చిహ్నమునకు మీకు సమర్పించుచున్నాను [కత్తిని రాజుపాదములకడ వైచి నిష్క్రమించును.]