పుట:2015.392383.Kavi-Kokila.pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

200 కవికోకిల గ్రంథావళి [స్థలం ఎనిమిది

నాయాజ్ఞకు మాఱు పల్కుటయా ? - మీకు మతిభ్రమణము కలిగినదా ? లేక నేను కుంభ రాణా యను సంగతి మఱచితిరా ? మమ్ము పదభ్రష్టుల గావించుటయేగాదు వధ్యశిలయొద్దకు మరణదండనము మీవెనువెంట నంటివచ్చును పొండు. మీ సర్వస్వము మా సైన్యాధిపతి జప్తిచేసి కోశాగారమున కర్పించును.

శ్యామ : సత్యమేవ జయతి. [నిష్క్రమించును]

మాధ : [అనుసరించును]

రాణా : [క్రోధముతో] పాదాన్వితములైన రాజద్రోహ పిండములు నడచిపోవుచున్నవి - ద్రోహులు - తేనెపూసిన కత్తులు - నట్టనడియేట పుట్టిముంచు పాతకులు - వారికి చెడుకాలమునకు బుద్ధి పెడదారి పట్టినది కాఁబోలు ! ఏమివారి అపూర్వప్రవర్తనము ! - ఓరీ.

భటు : స్వామి -

రాణా : పరుగెత్తుము. పొమ్ము. మాసేనాధిపతిని పిలుచుకొనిరమ్ము.

భటు : ఆజ్ఞ. [నిష్క్రమించును.]

రాణా : [ఉద్రిక్త చిత్తుఁడై అటునిటు తిరుగుచు] ఈ యమాత్యుల విపరీత ప్రవర్తనము నాకు బోధపడకున్నది. నన్ను ప్రతిఘటించుటకుఁ దగిన ధైర్యము వారి కెట్లువచ్చెను? ఆ ! యీ ధిక్కారము నేను సహింపఁజాలను.

[సేనాధిపతి ప్రవేశించును.]

సేనాధిపతి : జయము, జయము !

రాణా : ధర్మసింహా, నీవు గుఱ్ఱపు రౌతుల వెంటఁబెట్టుకొనిపోయి అమాత్యుల భవనములను ముట్టడించి, వారి స్థిర చరాస్తులను జప్తిచేసి కోశాధిపతి యాధీనము చేయుము. వారిరువురకు మరణదండనము విధించితిని. ఆజ్ఞా పత్రముగొని దానిని నిర్వహింపుము.