పుట:2015.392383.Kavi-Kokila.pdf/188

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్థలం ఏడు] కుంభ రాణా 195

రాణా : కాలము జరుగుకొలఁది దాంపత్యప్రేమ విడంబించి విధినిర్వర్తనమునందు అసమర్థుఁడను గావచ్చును.

శ్యామ : నాచిన్న మనవి యాలకింపుఁడు. ఈ విషయమును గుఱించి రాణిగారేమి సమాధానము చెప్పికొందురో తెలిసి కొనవలయును.

మాధ : అవును. అపరాధిని విచారింపక యెంత యల్పదండనము విధించినను అది న్యాయ్యముగాదు.

రాణా : నాకుఁదెలిసి నేనెవ్వరికి నన్యాయమొనరింపను. ఇంతకుఁ దెగించిన సాహసవతి తనతప్పుల నొప్పుకొనక పోవునా ? అయినను కనుగొందము. పిలిపింపుఁడు.

శ్యామ : రాణిగారు పట్టమహిషి !

రాణా : [కోపముతో] ఇంకను పట్ట మహిషియా ?

శ్యామ : దేవరవారు పట్టభద్రులై యున్నంతవఱకును.

రాణా : [విసుగుతో] నా సంకల్పము నాటంక పెట్టుటకు మీరు పండితులు. నే నిప్పు డేమి చేయవలయు?

శ్యామ : అంత:పురమునకుపోయి రాణిగారిని విచారింపవలయును.

రాణా : [లేచి కొంతదూరము పోయి, వెనుకకు మరలి కోపముతో] ఆపాపిష్టురాలి మొగము నే నింకఁ జూడనొల్లను. [కూర్చుండును]

శ్యామ : అట్లయిన నెవరినైన నియోగింపుఁడు.

రాణా : నే నెవ్వరిని విశ్వసింపఁ జాలను. నేనే పోయి విచారించెదను. ఇప్పుడు నేను భర్తనుగాను. న్యాయాధిపతిని. [లేచును.]

శ్యామ : మాకు సెలవిండు. మరల మాపై మీకు నమ్మకము గలిగినప్పుడు పిలిపింపుఁడు.

రాణా : [వినిపించుకొనక నిష్క్రమించును.]

మాధ : రాజు తననే తాను నమ్మలేఁడు. ఇఁక నితరులను నమ్ముటెట్లు ?