పుట:2015.392383.Kavi-Kokila.pdf/172

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్థలం ఏడు] కుంభరాణా 179

తక్కువ వ్యాఖ్యానము ?

బల : [అణఁగిపోయి] ప్రభువులవారు మత విషయములలో ఇంత కఠినముగా మాట్లాడడము కొంచెము - [నీళ్ళు నమలును]

రాణా : మూఢ భక్తులకు మతము కానిదేది ?

బల : పాఠశాలలో మతప్రచారము చేయకూడదని దేవరవారు కావించిన శాసనము ప్రజలలో కల్లోలము పుట్టించుచున్నది. పీఠాథిపతులు, కులగురువులు, రాజద్రోహము బోధించుచున్నట్లు వినికిడి. మొగలాయి వాళ్ళు మనమీఁద కత్తిగట్టియున్న యీసమయమున మన ప్రజలలో రాజ్యద్వేషం కలగడము మంచిపనిగాదు. ఏదో వృద్ధుఁడను. సంస్థాన శ్రేయోభిలాషిని, అనుభవశాలిని విన్నవించుకొన్నాను. తర్వాత ప్రభువుల చిత్తము.

రాణా : నిజమే! దానిని నేను గమనింపకపోలేదు. విశ్వసనీయుఁడైన సేనాధిపతికి ఖచ్చితమైన ఉత్తరువు పంపియున్నాను. ఈమతాధికారము ప్రతిపదమునందును నాయాజ్ఞ నెదుర్కొనుచున్నది. నారాజ్యమునందు నా శాసనమే శిరసావహింపఁబడవలయును. అరాజకము, బహురాజకము రెండును అపాయకములే ! మతాచార్యుల పలుకుబడి సన్నగిల్లిననే ప్రజలలో మూఢభక్తి నశింపఁగలదు. లౌకిక జ్ఞానమును, జీవితమును ద్వేషించు ప్రతి మతమును మానవుని మనోవికాసమునకు అభ్యంతరమగును. ఈ సంకుచిత మతములను నారాజ్యమునుండి సమ్మార్జింపవలయును.

బల : మతాధికారము చాలా శతాబ్దములనుండి వేళ్ళు పారియున్నది.

రాణా : నేను ప్రవేశపెట్టిన విద్యాపద్ధతికి కఱకైన వాదరగలదు.

బల : దేవరవారికి తెలియనిదేమున్నది ? సర్వజ్ఞులు - అయినా అనుభవశాలిని. శలవు పుచ్చుకొంటాను. [లేచి కొంతనడచి] మనవి చేసుకొన వలయునని మఱచిపోతిని - ఒక చిన్నసంగతి, ప్రభువులవారికి తెలియవలసిన ముఖ్యమైన విషయము గాదు.