పుట:2015.392383.Kavi-Kokila.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

176 కవికోకిల గ్రంథావళి [స్థలం ఆఱు

వాసం ; తమరు రాణిగారికి చవితి అయ్యింది మొదలు తమరి అందచందాన్నిచూచి వాసంతిక వురివేసుకొని చచ్చేవఱకు, రాణాగారు నిన్ను మోహించి ఆ హారం బహుమానం చేసేవఱకు.

సుశీ : నే ననుకొన్నట్లే మోసపోయావు.

వాసం : అదేంటి?

సుశీ : నీవు వచ్చి వాకిటివద్ద దాంకొన్నది అప్పుడే చూచాను. నీ వేమనుకొంటావో చూస్తామని అట్లా మాట్లాడినాను.

వాసం : [నవ్వుచు] నేనుమాత్రం నిజమనుకొన్నానా? నీవు తమాషా పట్టిస్తున్నావని నేనుకూడా నవ్వుతుణ్ణాను.

సుశీ : నేను ఎగతాళికి అన్నమాటలు నీవు దాసీలదగ్గర అనవద్దు. వొట్టు, వాళ్ళు ఎకసక్కెంమాటలుకూడా నిజమని యెత్తి పొడుస్తుంటారు.

వాసం :అంతేగా భాగ్యం. అట్లాగే, నాకు పనివుంది, మల్లీవస్తాను. [స్వగతము] ఇది నన్ను మోసంచేసినానని అనుకొంటుంది. దీన్ని మోసంచేసి కొరడా వేట్లతో నలుగు పెట్టిస్తాను. [నిష్క్రమించును.]

సుశీ : పాపము, వాసంతిక నన్నొకకంట కని పెట్టేవుంటుంది. ఎట్లయినా దానికి నన్నుచూస్తే కొంచెం భయమె. [హారముతీసి ఱవికెలో దోపు కొనును] శుక్రవారమునాడు తలకుపోసుకొని రాణి గారిచ్చిన బనారసుచీర కట్టుకొని మల్లీ యీ హారం వేసుకొంటాను.

[తెరలో 'సుశీలా, ఇంకా యేం చేస్తున్నావు?' అని కేక వినఁ బడును]

సుశీ : ఇదిగో! వస్తున్నాను. రాణిగారి మందు సంగతే మరచి పొయ్యాను. [నిష్క్రమించును]