పుట:2015.392383.Kavi-Kokila.pdf/153

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

160 కవికోకిల గ్రంథావళి [స్థలం నాలుగు

అగ్బ : పేరు వినుటకు సొంపుగనేయున్నది.

మురళి : నవుకరిమాత్రం బలే గడుసుగా వుందండి కడుపునిండా కూడులేదు. కంటినిండా నిద్రలేదు. కట్టుగుడ్డకు గూడా కరువు. ఇట్లాంటి కక్కురితి నవుకరి చేసేదానికంటె మీమాదిరి బైరాగులై "జై సీతారాం" మంటూ నాలుగిళ్ళకుపోయి నాలుగు పిడికెళ్ళు బియ్యంతెచ్చుకొని సుఖంగా పొట్టగడుపుకొంటూ కాలుమీద కాలువేసికొని ఏసత్రపుగోడకో ఆనుకొని దొరకొడుకు ఎట్టాండి వాడ్రా అనుకొంటూ కాలచ్చేపం చెయ్యడమే మేలుగా తోస్తుంది నాబుద్ధికి. మారాజులుకూడా సోమారిపోతుల్నే ఆదరిస్తారు. మాబోటి కష్టపడే వాళ్ళకు కూడులేదు యీకాలంలో. మావూళ్ళోవుండే రామాంజయ్యగోరు పొద్దున్నే మొగాన యెంటికపోసంత సందూ కూడాలేకుండా నామాలుపెట్టుకోని గుమ్మడికాయతపిలె నెత్తిన పెట్టుకోని అచ్చాపాత్రకొస్తాడు. సాయంత్రం పూలదండలమ్ముతాడు. నెలకి రెండు మోరీల అచ్చాపాత్రబియ్యం అమ్ముతాడు. సారాయంగడికి దినమ్మూ తప్పడు. మల్లీ పెళ్ళానికి బంగారు మురుగులు రాళ్ళకమ్మలు చెయ్యించాడు. ఇదంతా అచ్చాపాత్రడబ్బె ! ఇంక నేను నెలపొడుగుతూ నవకరిచేస్తే కల్లు తాక్కుండా బిగబట్టుకొని వుంటేగింటే పెళ్ళాం బిడ్దలకు దినానికి రెండు పూటలు కూడుదొరికేది కనాకష్టం. నాపెళ్ళాంగూడా బిచ్చమెత్తి మురుగులు చేయించిపెట్టమని దినమ్మూ తగువు. నాకు అదేతేలిగ్గా వుందిబాబు.

అగ్భ : దానము దుర్వినియోగమగుటయేతప్ప, బిచ్చ మెత్తుటవలన బీదతనము పోదు, ఎంతటివానికైనను కాలుసేతులు చక్కగానుండు నంతవఱకు యాచించుట నీచము.

మురళి : కడుపునకు చాలీచాలని నవుకరి అంతకంటె నీచంగా తోస్తుందండి. యాత్రకువచ్చిన పల్లెటూరివాండ్లను అదిలించి బెదిలించి, కొంచెము డాబుసరి మణుసులను యాచించి బేడా పాతికా సంపాయించుకొని కాలం గడుపుతూ వుండినాను. ఇప్పుడు మాకూట్లో రాయిపడిందండిబాబు.