పుట:2015.392383.Kavi-Kokila.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

158 కవికోకిల గ్రంథావళి [స్థలం నాలుగు

కట్టేవరకు వుపన్యాసంచేస్తాడు - ఏమోయ్ వెంకటదాసూ, బండ్లుకదిలి పోతున్నాయి రావయ్యా, మాటలెట్టుకోని పెద్దదొర కొడుకులాగా నిలుచున్నావు ?

వెంక : ఏమోయి, మనం దొరకొడుకులంగాక, రామరాజు ప్రభువు రాజ్యంచేసేవఱకు ఆంధ్రుడికుండే జబర్దస్తి పాచ్చావుకు కూడాలేదు, మన దెబ్బంటే గోల్కొండ అబ్బా అంటుంది!

గోకు : ఆఁ! యిట్లా యెగనిక్కినవాళ్ళే కిందపడేది. ఆఁ - ఇక చాలురావయ్యా ప్రసంగం.

వెంక : [కోపముతో] ఏమంత పుట్టుమునిగిపోయిందా యేంటి ? మనిషి కనబడితే మాట్లాడనియ్యవు, నీబోటి శకునాలపక్షితో కూడా వస్తే యింతేకదూ మఱి.

యాత్రికులు : హా ద్వారకీవాసా, శ్రీకృష్ణా, జయరమారమణ గోవిందోహరి. [మూటముల్లె లెత్తుకొని కదలుదురు.]

అగ్బ : మనము దైవముచే వచింపఁబడితిమి; మందభాగ్యులము. ఆ పరమ భక్తురాలి వైరాగ్యమును ధ్యానపారవశ్యమును ఉన్మాదముగా శంకించి విషయలోలుఁడైన రాణా ఆమెను అంత:పురమున బంధించి యుండవచ్చును. ఇఁక మనమెట్లు దర్శింపఁగలము?

తాన్ : మనలను ప్రేరించి యింతదూరము ఈడ్చుకొనివచ్చిన యాభగవంతుఁడు మన కేదైన సదుపాయము చూపింపకపోవునా ?

అగ్బరు : మిత్రమా, కోకిల పంజరమున బంధింపఁబడియు గానము మానదుగదా ?

తాన్ : గానమున కప్పుడే యెక్కుడావశ్యకత. వేదనా మృదులమైన గానము మఱింత మధురమై భువనేశ్వరుని హృదయ ద్వారముకడ అతిథియై నిల్చి తలుపుఁదట్టగలదు. - ఇఁక విశ్రమించెదము.

అగ్బ : మీరాబాయిని దర్శించువఱకు నాకెక్కడి విశ్రాంతి ?