పుట:2015.392383.Kavi-Kokila.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్థలము నాలుగు] కుంభరాణా 155

[ఒక ఫకీరు ఈకేకలకు నిద్రమేల్కొనును.]

ఫకీరు : అయ్! ఏకోన్ రే తెలంగిముసాఫిర్, రాత్రిహంతా దివానా మాద్రి పుకార్ శేస్తాడ్ ? ఈ హడావుడీమే మాకి హొక్క ఛనంకూడా నీంద్‌వుందిలేదు. హొక్డుముసాఫిర్ వస్తాడ్ హరిబోలో హరిబోలో శెప్తాడ్, ఇంకాహొక్డు బైరాగివస్తాడ్ జయ్‌సీతారాంబోల్తాడ్. తుత్తెరీ గడ్బడా హింద్వాలోగ్. [కోపముతో జోలె గొంగడి జవురుకొని పోవును.]

వెంకటదాసు : నీదేంటోయ్ ? పక్కీరి, కీసరపాసర మంటావు, కట్టెపుచ్చుకోని నీబుఱ్ఱ బద్దలు చెయ్యనా యేంటి.

[ఇంతలో యిద్దరు యాత్రికులు తూఁగుకన్నులతో లేచి కూర్చుండి "పట్టుకో పోనియ్యవద్దు, దొంగలు, దొంగలు" అని అరతురు.]

వెంకట : ఏఁటీ ఆవెఱ్ఱి కలవరింపు ? పట్టుకోవడమేంటి !

యాత్రికుడు : నీవు మఱి బుఱ్ఱ బద్దలుకొట్టమన్నది దొంగల్ని కాదూ ?

వెంకట : (పకాయించి నవ్వును.)

[ఈసందడికి యాత్రికులందఱు లేచి మూటా ముల్లె సవరించుకొందురు. ఇంతలో అగ్బరు తాన్‌సేనులు హిందూ యాత్రికుల వేషములతో ప్రవేశింతురు.]

అగ్బరు : వారుచెప్పిన పాంథశాల యిదియేకాఁబోలు.

తాన్‌సేన్ : ఈరాత్రి మనమిచ్చటనే నిదురించి వేఁగుజామున లేచి కృష్ణమందిరమునకు పోవచ్చును.