పుట:2015.392383.Kavi-Kokila.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

152 కవికోకిల గ్రంథావళి [స్థలం మూడు

మీరా : అగ్బరు పాదుషావంటివాఁడే గోపిచందనము ధరించి భక్తిమార్గము నవలంబించి హిందూ మతమును ఆదరించుచున్నాఁడని వినికిడి.

రాణా : [కోపముతో] అగ్బర్ ? మరల ఆతని ప్రశంస. ఇదివఱకే పలుమాఱులు హెచ్చరించితిని. ఆతని ప్రశంస నారాజ్యమునందు అపరాధము. ఆతఁడు మేకవన్నెపులి. తేనేపూసిన కత్తి. చిరకాలమునాఁటి రసపుత్రరాజ్యములను మెలమెల్లగ కబళించుచున్నాఁడు. ఆతని రాజకీయ నీతి అతలస్పర్శి. - ఆ! - సరి, సరి. నీయభిమానమునకు కారణముకలదు. అగ్బరు నిన్ను వివాహమాడ తలఁచి యుండెనుగదా. మీతండ్రికి మానము ఆభిజాత్యము లేకుండిన నీవు సార్వభౌముని శుద్ధాంత కాంతవై యుందువు. పాపము, నీదురదృష్టవశమున నాబోఁటి యల్పమండలేశ్వరునకు భార్యవైతివి.

మీరా : కడచిన గాధలేల త్రవ్వెదరు ? మీమనస్సులోని వేరు పుర్వు ఇంకను నశింపలేదు. మీయనుమానమె మీకు తెవులులేని వేదనయగుచున్నది. అగ్బరు పాదుషా మనకు విరోధియైనంత మాత్రమున ఆయన పేరుకూడ ఉచ్చరింపకూడదా ? విరోధి లొనున్నంతమాత్రమున సద్గుణములు గౌరవింపఁబడకూడదా ? పాదుషాహి జనకునివంటి కర్మయోగియని వింటిని.

రాణా : [పిడుగడచినట్లు నిర్విణ్ణుఁడయి, కోపఘూర్ణిత నేత్రుడయి] ఏమీ ? - నాసతి - నాయెదుట - ఆరసపుత్రకుల మానాపహారిని ఆమ్లేచ్ఛుని ప్రశంసించుట ? వాని దుర్ణయములను సమర్థించుట ! - సహింపరాని పతితిరస్కృతి. ఓసి మాన రహితా, నీవెంత సాహసమున కొడిగట్టితివి ? ఆ మాయవేషగాఁడా నీకు పూజ్యుఁడు ? ఆ కపటనాటకము హిందువుల నాకర్షించి మోసగించుటకై పన్నిన పన్నాగమని నీవెఱుఁగవా ? గౌరవమైన రసపుత్రకులము చెడపుట్టిన బీహారిమల్లునివంటి వంశపాంససులు వానిపాదములు నాశ్రయించి తమకూఁతుండ్లను వాని యంత:పురకాంతలు గావించి వాని గులాములకు గులాములై తిరుగుచుండ నేనొక్కఁడనే వానిని ధిక్కరించి స్వతంత్రుఁడనై యుండుట నీవెఱుంగవా ? ఆదురా