పుట:2015.392383.Kavi-Kokila.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్థలం మూడు] కుంభరాణా 147

ద్రమును నమ్మి చేతిలోని పాయసపు పాత్రను జాఱవిడుచు మూఢుడుండునా ? దారిద్ర్యచింతా పీడితుల నూరడించుటకొఱకు, పరలోకముమీఁది యాసతో నిహలోక దు:ఖము సహించుటకొఱకు, అవివేకులను భయపెట్టి ధర్మబద్ధులను జేయుటకొఱకు పౌరాణికులు స్వర్గనరకములను కల్పించిరి. పరలోకమునకు ద్వారపాలకులు గురువులఁట! వారికి లంచమిచ్చినవారికి పరమపదము ! నిరసించినవారికి నరకము కాఁబోలు ! ఎంత యవివేకము ?

మీరా : [దీనముగ] అయ్యో! యేల యీ పరలోకదూషణము, గురునిరసనము ? అహంకారచిత్తు లెఱుఁగఁజాలని తత్త్వరహస్యము లెన్ని లేవు ?

                      కండ నెత్తురు ప్రాయంపుఁ గారవంబు
                      కనుల కెగఁదట్టఁ దత్త్వంబు గానఁబడదు;
                      పాలనా దండశక్తి నశ్వరమటన్న
                      పిడుగువంటి సత్యంబును వినెద వెపుడొ.

రాణా : మీరా, నీ నిరసన స్వభావము నాకు కోపము గొల్పినను నీయజ్ఞానమునకు మాత్రము నాకు జాలికలుగుచున్నది. ఆఁడువా రబలలు దుర్బలచిత్తలు. వివేకమునకన్న భావోద్రేకము మిక్కుటము. కావుననే మత విక్రేతలగు కపటగురువులు మిమ్ములను దేలికగ లోపఱచుకొని వంచింతురు. పాక్షికమతావలంబకులే లోకమునకు ఉపద్రవకారులు, స్వయమారోపితమైనవారి పవిత్రత ఏవము పుట్టించును; వారి దుర్ణయములు దురాచారములు మతాచ్ఛాదసముతో లోకుల మోసగించు చున్నవి. మీరా, నీమతోన్మాదము నీకు పరలోకము నిచ్చునో లేదో తెలియదు గాని, సంతోషముగను నిశ్చింతముగను గడచిపోవుచుండిన మన గార్హస్థ్య జీవితమును మాత్రము భగ్నముచేసినది.