పుట:2015.392383.Kavi-Kokila.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

132 కవికోకిల గ్రంథావళి [స్థలం

సుబ్బ : ఆలాగా ? పట్టపుదేవిని మనము సూస్తే యింకా బతకడం గూడానా ?

వెంక : ఆ బక్తురాలికి రాణి వాసంలేదు.

సుబ్బ : అందరూ సూశేటట్లు పెళ్ళాన్ని యీదులు తిప్పేరాజు యేంరాజోసి తోసిరాజు !

అర్చకుఁడు : [చేతులుతట్టి] ఓయ్, పండ్లూ ఫలాలు బేడా పాతిక యేదైనా తెస్తే సన్నిధిలో సమర్పించండి. తీర్థం శటకోపం తీసుకోండి.

సుబ్బ : ఒకమూల కడుపు కాలు తుంటే శిత్తం శివుడిమీద నిలుస్తుందా యేవిటి ?

వెంక : మీరాబాయమ్మ యెప్పుడు ఇక్కడికి వస్తాదండి ?

అర్చ : ఆమె యిప్పుడు రాదు. మీరు తెచ్చిన నైవేద్యం తృణం ఫణం యీతట్టలో పడవేయండి.

[హారతిపళ్ళెము చూపించును.]

సుబ్బ : [వెంకయ్యతో రహస్యముగ] ఇక్కడిది ఇక్కణ్ణే రంగరిస్తాం. [ప్రకాశముగ] అంతా దేవుడి సొత్తేగదండి. పళ్ళు ఫలాలు ఇక్కడివే పెట్టండి.

వెంక : ఒక అణారూక పెట్టు.

సుబ్బయ్య : కాటికాపైనా తప్పినా తప్పుతుందిగాని, అర్చకుడి కట్నంమాత్రం తప్పేది కనాకష్టం. [కుచ్చె కొంగుముడివిప్పుచు] ఇంట్లో డబ్బు స్మరణా, ఈదులో డబ్బుస్మరణా, దేవళంలోకూడా డబ్బు స్మరణేనా సోమీ ?

అర్చ : [కర్పూరము వెలిగించి హారతి త్రిప్పుచు] ఏడ్చినట్లే వుంది మీ స్మరణా, మీభక్తి ! యాత్రవచ్చినప్పుడైనా పదిపాతికలు ఖర్చు చేయరాదూ ? [ఈలాటి మంత్రములతో హారతియిచ్చి, ఒక తులసిదళం ప్రసాదముగా యిచ్చును.]