పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/623

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ.

నట్టి భగవంతుఁ గీర్తిదిగంతు శాంతు | దాంతు శ్రీమంతు ధీమంతుఁ దగ భజింతు,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ!

72


సీ.

అవిముక్తరాజధానివిరాజమాన కో- | దండరాజము లేఖ తటిని గొనము
కేవల లోలార్కకేశవుల్ కొటికలు | మహనీయధర్మంబు మార్గణంబు
గోఘ్న ద్విజాతిఘ్న గురుతల్పగానవా- | స్వాదన స్వర్ణాపహార ముఖ్య
కలుషజాతంబు లక్ష్యము నీవు ధానుష్క- | చూడామణివి నిన్నుఁ జూడఁగోరు


గీ.

వారి సుకృతము వర్ణింప వశము గాదు | ధాతకయిన భుజంగమనేతకైన,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ!

73


సీ.

ఆకులు మేయవే మేఁకలు నీటిలో- | పలను మెలంగవే జలచరములు
వృక్షశాఖల వ్రేలవే గబ్బిలములు | చెప్పినఁ బలుకవే చిలుకగములు
వాయువు గ్రోలవే వ్యాళము లనయంబు | విపినవాసము సేయవే మృగములు
ధ్యానంబు సేయవే తద్దయు బకములు | గుహల నర్తింపవే కోరి హరులు


గీ.

జపతపస్స్నానసంధ్య లా సద్గతికిని | కారణంబులు దృఢబుద్ధి కాక భళిర,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ!

74