పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/612

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ.

మాతృపితృవర్జితుండవు జాతి లేదు | పెక్కుపేరులు నీకొక పేరు లేదు,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ!

48


సీ.

ఆతతశూలసమేతుండవయ్యును | వ్యాధివిదూరుండవై వరలుట
యతులితసోమాహ్వయప్రదీపితుఁడవ- | య్యును గమలాప్తత నొందుటయును
నిక్కంబు పుష్కరనేత్రుండవయ్యును | బుణ్యజనావనస్ఫూర్తిఁ గనుట
కడువడి గంగాధరుఁడవయ్యు జటులకృ- | శానుతేజోవృద్ధిఁ బూనుటయును


గీ.

నిర్భరాశ్చర్యములు కదా నీ మహిమలు | మహి నసాధారణములు సామాన్యులకును,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ!

49


సీ.

కమనీయముద్రికాకటకకేయూరాద్య- | లంకార మండలాలంకృతంబు
తుహినావనీధరదుహితృమతల్లికా- | వితతనేపథ్య సద్విరచనంబు
సౌవర్ణఘంటికారావబంధుర వృష- | స్కంధాగ్రభాగ సంస్ఫాలనంబు
లోకభయంకర కాకోలజంబూఫ- | లాకారకృన్నిపుణాంచితంబు-


గీ.

నైన భవదీయహస్తము నభవ నాదు | మస్తకముపైనిఁ జేరిచి మాన్పు భయము,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ!

50