పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/597

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ.

నీదు నామమహత్తు వర్ణింపఁ దరమె | కింపురుష సిద్ధసాధ్య నిలింపులకును,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ!

15


సీ.

స్ఫురదణిమాది విభూతులు గలుఁగఁగా | నింటింట భిక్షకు నేఁగనేల
సర్వమంగళ నీకు సామేన నుండఁగా | బెస్తకన్నెను నెత్తిఁ బెట్టనేల
వెండిగుబ్బలిపైఁ బరుండక ననిశంబు | నొలకలలోపల నుండనేల
వేలుపుల్ గొల్వఁ బేరోలగంబున నిల్వ | కురుభూతముల వెంటఁ దిరుఁగనేల


గీ.

మతవిరోధులు శంభుఁ డమంగళుండ- | టన్నఁ దవులదె నా మది విన్నఁదనము,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ!

16


సీ.

మారునిఁ గాలిచి మరుభూతి మైనిండ | మలయజంబు విభాతి నలఁదినావు
మాతంగదైత్యుని మర్దించి తచ్చర్మ- | ముత్తరీయంబుగా నుంచినావు
వనజోదరు శిరంబు వ్రచ్చి తదీయ క- | ర్పరముఁ బాత్రముగఁ జేపట్టినావు
గరళంబు మ్రింగకఁ గంఠకోణమున మా- | నితలాంఛనంబుగా నిలిపినావు


గీ.

యిటుల సేత పరాక్రమం బెఱుకపడుట- | కో యపస్మారిగుణమొ నాకు సెలవిమ్ము,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ!

17